ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల మధ్య చురుకుగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ, అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేటి నుంచి తన స్వస్థలం పులివెందులలో రెండు రోజుల పర్యటన ప్రారంభిస్తున్నారు.
పర్యటన షెడ్యూల్
మొదటి రోజు పులివెందులకు (Pulivendula) చేరుకున్న జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ (Public Grievance Meeting) నిర్వహించి ప్రజలను నేరుగా కలుసుకుంటారు. వారి సమస్యలు విన్న తర్వాత అక్కడే బస చేస్తారు.
రెండో రోజు ఉదయం పులివెందుల నుంచి వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామానికి వెళ్లి కొత్తగా ఏర్పాటైన నందీశ్వర ఆలయం (Nandeeswara Temple) విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం తిరిగి పులివెందులకు చేరుకుని మరోసారి ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. తరువాత స్థానిక పార్టీ నాయకులతో సమావేశమై రాత్రికి అక్కడే బస చేస్తారు. అనంతరం ఆయన బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉంది.






