ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ (Official Facebook Page) భారతదేశంలో (India) అందుబాటులో లేకుండా చేయడంపై తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం (Chandrababu Naidu Government) ప్రజలతో పాటు ప్రతిపక్షాల గొంతులను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని జగన్ ఆరోపించారు. ఈ ఏడాది ప్రారంభంలో పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను (Official Instagram Account) తొలగించిన తర్వాత, ఇప్పుడు భారతదేశంలో వైఎస్సార్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీని (YSRCP Official Facebook Page) కూడా అందుబాటులో లేకుండా చేశారని పేర్కొన్నారు.
ఇది కేవలం ఒక రాజకీయ పార్టీపై దాడి మాత్రమే కాదని, ప్రజాస్వామ్య విలువలు మరియు భావ ప్రకటనా స్వేచ్ఛపై నేరుగా జరిగిన దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, ప్రజా సమస్యలను ఆధారాలతో వెలుగులోకి తీసుకువస్తోందని, అలాంటి గొంతులను అణచివేయడం అత్యంత అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు.
అమరావతి (Amaravati) రాజధాని అభివృద్ధి వ్యయాలు, డీఎస్సీ (DSC) ప్రక్రియలో అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లు (TTD Ghee Tenders, పెరుగుతున్న అవినీతి (Corruption) వంటి ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం నుంచి, సోషల్ మీడియాలో విమర్శనాత్మక కంటెంట్‌ను నిరోధించే ప్రయత్నాల వరకు ప్రభుత్వం ఆందోళనకరమైన ధోరణిని అవలంబిస్తోందని జగన్ ఆరోపించారు.
ఈ చర్యలను చట్టపరంగా, రాజ్యాంగపరంగా సవాలు చేస్తామని స్పష్టం చేసిన ఆయన, బెదిరింపులు, సెన్సార్‌షిప్ (Censorship) లేదా సంస్థల దుర్వినియోగం ద్వారా ప్రజల గొంతును ఎవరూ అణచలేరని అన్నారు. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే దిశగా వైఎస్సార్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీని వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మెటా సంస్థతో పాటు భారత ప్రభుత్వంలోని కీలక అధికారులను తన పోస్టులో ట్యాగ్ చేశారు.






