రాజమండ్రిలో (Rajahmundry) వెలుగులోకి వచ్చిన కల్తీ పాల (Adulterated Milk) వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలో రాజమహేంద్రవరంలో (Rajamahendravaram) కల్తీ పాలు తాగి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బాధిత కుటుంబాలు (Victim Families) న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని (YS Jagan Mohan Reddy) కలిసి తమ గోడును వినిపించారు.
అనంతరం మాజీ ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat) మీడియాతో మాట్లాడుతూ, కల్తీ పాల మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశ చరిత్రలోనే కల్తీ పాలు తాగి 16 మంది మరణించడం లాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదని పేర్కొంటూ, ఇంతటి విషాదం జరిగినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) లేదా ఆరోగ్య శాఖ మంత్రి బాధితులను పరామర్శించకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని, అవసరమైతే ఎయిర్‌లిఫ్ట్ చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu), జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారని, కానీ ప్రస్తుతం రుహానియా పూర్తిగా కోలుకోకముందే డిశ్చార్జ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం బాధాకరమని భరత్ ఆరోపించారు.
బాధిత కుటుంబాలు ఇప్పటికే తమ సొంతంగా రూ.4 లక్షల వరకు వైద్య ఖర్చులు భరించాయని, ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రీయింబర్స్ చేయలేదని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రకటించిన రూ.10 లక్షల పరిహారాన్ని రెట్టింపు చేయాలని, అలాగే రుహానియా, రిత్విక్ వంటి బాధితులకు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అసలు పాలలో ఏ విషపదార్థాలు కలిశాయనే విషయంపై ఇప్పటివరకు అధికారిక నివేదిక విడుదల కాలేదని, ప్రభుత్వం ఈ అంశంపై చేతులు దులుపుకుంటోందని భరత్ విమర్శించారు. వైఎస్ జగన్ బాధితులకు పూర్తి భరోసా ఇచ్చారని, భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారు చేసిన వైద్య ఖర్చులను రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
రిత్విక్ (Ritwik) తండ్రి(Father) లవరాజ్ (Rakesh) మాట్లాడుతూ, మొదట్లో ఆసుపత్రిలో సరైన చికిత్స అందించినా తర్వాత అధికారులు పట్టించుకోలేదని, హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఇతర సహాయం కోసం ఎమ్మెల్యే, కలెక్టర్ చుట్టూ తిరిగినా స్పష్టమైన సమాధానం రాలేదని వాపోయారు. తమ కుమారుడి చికిత్స కోసం రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేశామని తెలిపారు.
రుహానియా తండ్రి రాకేష్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 16 నుంచి తమ కుమార్తె చికిత్స పొందుతోందని, ఇప్పటికే రూ.3.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు ఖర్చు అయ్యిందని చెప్పారు. పాప కిడ్నీ ట్యూబ్స్ (Kidney Tubes) ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అయినప్పటికీ డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రిపై ఒత్తిడి వస్తోందని ఆరోపించారు. 9 కిలోల బరువు ఉన్న పాప ప్రస్తుతం 4.5 కిలోలకు పడిపోయిందని, భవిష్యత్తులో సమస్యలు వస్తే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు.
వైద్యం కోసం కాకినాడ, విజయవాడ వెళ్లాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ ప్రతిరోజూ అంత దూరం ప్రయాణించడం సాధ్యం కాదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ అంశంపై మార్గాని భరత్ ఇప్పటికే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మరియు చైల్డ్ రైట్స్ కమిషన్‌కు లేఖలు రాసినట్లు తెలిపారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయం చేయాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఈ ఘటన ఆహార భద్రతపై ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోందని ఆయన అన్నారు.





