ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సంచలనం సృష్టించిన సాయికృష్ణ (Sai Krishna) లాకప్ డెత్ (Lockup Death) ఘటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర అనుమానాలు, ఆందోళనలు కలిగిస్తోందని ఆయన అన్నారు. సీఐపై హత్య కేసు నమోదు కావడం ద్వారా సాయికృష్ణ మరణం సహజ మరణం కాదని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్టేనని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తిపై 1 లేదా 2 కేసులు(Cases) ఉన్నాయనే కారణంతో అతని ప్రాణాలు తీసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.
సాయికృష్ణ తల్లి(Mother) వ్యక్తం చేస్తున్న వేదన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోందని అమర్నాథ్ అన్నారు. తన కుమారుడు మరణించిన తర్వాత కనీసం అతడి బూడిదైనా అప్పగించాలని తల్లి వేడుకుంటున్న పరిస్థితి అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, కేసులు ఉన్నాయనే కారణంతో ఎవరినైనా చిత్రహింసలకు గురిచేసి చంపడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా నిలుస్తుందని చెప్పారు.
కృష్ణలంకలో (Krishnalanka) జరిగిన ఈ ఘటన పోలీసు వ్యవస్థకు గుణపాఠంగా మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లతో కేసులు నమోదు చేయడం, అనంతరం నిందితులపై అమానుషంగా వ్యవహరించడం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోందన్నారు. ప్రజలను రక్షించాల్సిన చట్ట అమలు సంస్థలే భయానికి కారణమవుతుండడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం, హోం శాఖ, పోలీసు యంత్రాంగం పనితీరుపై కూడా అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు రాష్ట్ర భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరిగేవని, ఇప్పుడు మాత్రం శాంతిభద్రతల (Law and Order) పరిస్థితి క్షీణిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై పూర్తి స్థాయి స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సాయికృష్ణ కేసులో కేవలం సీఐపై కేసు నమోదు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని అమర్నాథ్ ఆరోపించారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), హోంమంత్రినే (Home Minister) ప్రధాన బాధ్యులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఇది సాధారణ ఘటన కాదని, ప్రభుత్వ హత్యగా ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒక ఐజీ పరిధిలో ఉన్న కమిషనరేట్‌లో జరిగిన ఘటనపై అదే వ్యవస్థలోని అధికారులతో విచారణ జరిపితే అసలు నిజాలు బయటకు వస్తాయా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జంగిల్ రాజ్ (Jungle Raj) నెలకొంటోందని అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కాదు, ప్రజలే తమ సామాన్లు సర్దుకుని రాష్ట్రాన్ని విడిచి వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. కేసులు ఉన్నాయనే కారణంతో ఒక మనిషిని హత్య చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. జూన్ 9 నుంచి సాయికృష్ణ మరణించిన రోజు వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిసరాల్లో నమోదైన ప్రతి సీసీ దృశ్యాన్ని ప్రజల ముందుంచాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.







