ఫిఫా వరల్డ్‌కప్ 2026లో (FIFA World Cup 2026) అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) మరోసారి తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు. గ్రూప్-జేలో భాగంగా అల్జీరియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ (Hat-trick Goals) సాధించి అర్జెంటీనాకు 3-0 తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ ఫలితం కంటే ఎక్కువగా చర్చనీయాంశమైన విషయం మెస్సీ తొలి గోల్ అనంతరం భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడమే.
మ్యాచ్‌లో తొలి గోల్ నమోదు చేసిన వెంటనే మెస్సీ కళ్లలో నీళ్లు కనిపించాయి. గోల్ సెలబ్రేషన్ సమయంలో ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఫుట్‌బాల్ (Football) ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించిన మెస్సీ ఎందుకు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటనపై స్పందించిన మెస్సీ తన కన్నీళ్లకు ఫుట్‌బాల్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులుగా వ్యక్తిగత జీవితంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నానని, ఆ సమయంలో తనకు జట్టు సభ్యులు, కోచింగ్ సిబ్బంది, అర్జెంటీనా ప్రతినిధి బృందం అందించిన మద్దతు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపాడు.
తాను ఎదుర్కొన్న కష్టాల మధ్య కూడా మైదానంలో పూర్తి ఏకాగ్రతతో ఆడి జట్టుకు విజయం అందించడం సంతోషంగా ఉందని మెస్సీ పేర్కొన్నాడు. తనతో పాటు జట్టు మొత్తం చూపించిన ఐక్యతే ఈ విజయానికి ప్రధాన కారణమని వెల్లడించాడు.
అల్జీరియాపై సాధించిన ఈ హ్యాట్రిక్ మెస్సీ కెరీర్‌లో మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఇది ఆయన అంతర్జాతీయ కెరీర్‌లో 200వ మ్యాచ్ కావడం విశేషం. ఈ ప్రత్యేక మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ నమోదు చేసి తన గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు.
అంతేకాకుండా వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో మరో కీలక రికార్డును సమం చేస్తూ మెస్సీ తన పేరును మరింత బలంగా నిలబెట్టుకున్నాడు. వ్యక్తిగత కష్టాలు ఎంత పెద్దవైనా, మైదానంలో తన ప్రదర్శనతో జట్టును ముందుకు నడిపించగల నాయకుడు తానేనని మరోసారి నిరూపించాడు.






