టైటిల్ : జన నాయకన్(జన నాయకుడు)
నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు తదితరులు
నిర్మాణ సంస్థ: కేవీఎన్ ప్రొడక్షన్స్
నిర్మాత: వెంకట్ కె. నారాయణ (కేవీఎన్)
దర్శకత్వం: హెచ్. వినోద్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: ప్రదీప్ ఇ. రాఘవ్
విడుదల తేది: జులై 23, 2026
తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో జన నాయకన్‌పై (Jana Nayagan) మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో సెన్సార్ వివాదాలు, రిలీజ్ వాయిదా వంటి పరిణామాలు సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చాయి. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా జులై 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి విజయ్(Vijay) సినీ కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ ఏంటంటే?
దళపతి (Dalapathi) వెట్రి కొండన్ పోలీసు అధికారి. ఓ కేసులో శిక్ష అనుభవిస్తూ మధురై సెంట్రల్ జైలులో (Central Jail) ఉంటాడు. కొత్తగా వచ్చిన జైలు వార్డెన్ (Jail Warden) అతని మంచితనాన్ని గుర్తించి అనారోగ్యంతో ఉన్న తల్లిని చివరిసారి చూసే అవకాశం కల్పిస్తాడు. అనంతరం సాధారణ క్షమాభిక్షతో విడుదల కూడా అవుతాడు.జైలు వార్డెన్ కుమార్తె విజ్జితో దళపతికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. ప్రమాదంలో వార్డెన్ మరణించడంతో ఆమె బాధ్యత మొత్తం దళపతి తీసుకుంటాడు. అయితే విజ్జిని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. ఈ కుట్ర వెనుక గ్యాంగ్ స్టర్ హిమ్లర్ ఉన్నాడని దళపతి తెలుసుకుంటాడు.
అసలు హిమ్లర్ ఎవరు? విజ్జిని ఎందుకు చంపాలనుకున్నాడు? ఆఫ్రికాలో విధ్వంసం సృష్టించిన అతడు భారత్‌కు(India) ఎందుకు వచ్చాడు? దేశంపై వేసిన కుట్రను దళపతి ఎలా అడ్డుకున్నాడు? ఈ ప్రయాణంలో జర్నలిస్ట్ కాయల్ ఎలా తోడైంది? అన్నదే మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే?
ఈ సినిమా చూస్తుంటే బాలకృష్ణ (Balakrishna) నటించిన భగవంత్ కేసరి గుర్తుకు రావడం ఖాయం. ఆ కథకు రాజకీయ అంశాలు జోడించి విజయ్(Vijay) ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ స్థాయిలో తెరకెక్కించిన ప్రయత్నం కనిపిస్తుంది. ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక ఎలివేషన్ సన్నివేశాలు, డైలాగులు రాసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.అయితే ఈ అంశాలు విజయ్ అభిమానులను ఆకట్టుకున్నా సాధారణ ప్రేక్షకులకు మాత్రం అంతగా కనెక్ట్ కావు. ఇప్పటికే భగవంత్ కేసరి చూసిన వారికి సినిమా చాలా వరకు ఊహించదగ్గ విధంగానే సాగుతుంది.
ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది?
మొదటి భాగం పూర్తిగా హీరో ఎలివేషన్స్, మాస్ యాక్షన్, ఫ్యాన్స్‌ను థియేటర్‌లో హైప్ చేసే సన్నివేశాలతో నిండిపోయింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్, పవర్ ఫుల్ ఫైట్లు, మాస్ డైలాగులు ఉన్నా వాటిలో కొత్తదనం మాత్రం కనిపించదు. అయినప్పటికీ కమర్షియల్ టచ్ కారణంగా ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఎంటర్‌టైన్ చేస్తుంది.
సెకండ్ హాఫ్ నిరాశపరిచిందా?
రెండో భాగంలో సినిమా పూర్తిగా హింసాత్మకంగా మారుతుంది. లాజిక్‌కు దూరంగా సాగే సన్నివేశాలు, అవసరానికి మించిన రాజకీయ డైలాగులు కథను బలహీనపరుస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రోబోలతో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షగా మారుతుంది.ఎలివేషన్స్, మాస్ ఫైట్లు మాత్రమే కోరుకునే వారికి సినిమా నచ్చొచ్చు. కానీ బలమైన కథ, కొత్తదనం ఆశించే వారికి మాత్రం నిరాశ తప్పదు.
ఎవరెలా చేశారంటే?
దళపతి పాత్రలో విజయ్ తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో పూర్తిగా మెప్పించడంతో పాటు ఒక పాటలో డ్యాన్స్‌తో అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు.బాబీ డియోల్ విలన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. విజ్జి పాత్రలో మమితా బైజు బాగా నటించింది. అయితే ఆ పాత్ర ప్రభావం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.పూజా హెగ్డే అందంగా కనిపించినప్పటికీ నటనకు పెద్దగా అవకాశం రాలేదు. ప్రకాశ్ రాజ్ పాత్ర బాగున్నా తెలుగు డబ్బింగ్ అంతగా ఆకట్టుకోదు. నాజర్, ప్రియమణి, రేవతి తదితరులు తమ పాత్రల మేరకు న్యాయం చేశారు.
టెక్నికల్‌గా ఎలా ఉంది?
అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం చాలా రిచ్‌గా కనిపిస్తాయి. భారీ బడ్జెట్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపించేలా నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు.
ఫైనల్‌గా…
జన నాయకన్ పూర్తిగా విజయ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన మాస్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఫ్యాన్స్‌కు ఎలివేషన్స్, మాస్ సీన్లు, యాక్షన్ ప్యాకేజ్‌గా ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. అయితే సాధారణ ప్రేక్షకులు కొత్త కథ, బలమైన స్క్రీన్‌ప్లే ఆశిస్తే మాత్రం నిరాశ చెందే అవకాశాలు ఎక్కువ. విజయ్ సినీ కెరీర్‌కు ఇది భావోద్వేగ వీడ్కోలు అయినప్పటికీ, సినిమా మాత్రం అందరికీ కనెక్ట్ అయ్యే స్థాయికి చేరుకోలేకపోయింది.






