చెన్నై (Chennai) నగరంలోని గిండి కత్తిపార ఫ్లైఓవర్ (Guindy Kathipara Flyover) సమీపంలో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) కుమారుడు, యువ గాయకుడు ఏఆర్ అమీన్ (A.R. Ameen) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి (Car Accident) గురైంది. ఈ ఘటన తమిళ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
తన స్నేహితుడు భార్గవ్‌తో (Bhargav) కలిసి ఏఆర్ అమీన్ కోయంబేడు నుంచి కారులో బయలుదేరారు. గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఓ కాల్ టాక్సీని వీరి కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు భారీగా దెబ్బతిన్నప్పటికీ అదృష్టవశాత్తూ ఏఆర్ అమీన్, ఆయన స్నేహితుడు భార్గవ్‌తో పాటు టాక్సీ డ్రైవర్ కూడా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఏఆర్ అమీన్, ఆయన స్నేహితుడు భార్గవ్‌ను చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం వారిద్దరూ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు.
మరోవైపు గాయపడిన టాక్సీ డ్రైవర్‌ను కళైజ్ఞర్ శతాబ్ది ఆసుపత్రికి (Kalaignar Centenary Hospital) తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కూడా డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై అడయార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రి ఏఆర్ రెహమాన్ బాటలో చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఏఆర్ అమీన్ 2015లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ కాదల్ కణ్మణి’ చిత్రం ద్వారా గాయకుడిగా పరిచయమయ్యారు. తెలుగులో ఈ సినిమా ‘ఓకే బంగారం’ పేరుతో విడుదలైంది.
ఆ తర్వాత తన ప్రత్యేకమైన, మధురమైన స్వరంతో ఏఆర్ అమీన్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. శింబు నటించిన ‘పత్తు తల’ చిత్రంలోని ‘నినైవిరుక్కా’, రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలోని ‘సిక్రి’ పాటలతో పాటు హిందీలో విడుదలైన ‘భీగీ భీగీ’ ఆల్బమ్ ద్వారా కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం ఏఆర్ రెహమాన్‌తో పాటు యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా వంటి ప్రముఖులతో కలిసి పలు చిత్రాలు, ఆల్బమ్స్‌లో పాటలు పాడుతున్నారు. తండ్రి ఏఆర్ రెహమాన్ వారసుడిగా సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఏఆర్ అమీన్‌కు ఈ ప్రమాదం నుంచి ఎలాంటి ప్రాణహాని లేకుండా బయటపడటం ఆయన అభిమానులకు ఊరటనిచ్చింది.







