గత ఐదేళ్లలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా ముందుకు సాగిన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), కూటమి ప్రభుత్వ హయాంలో (Coalition Government) పెట్టుబడుల ఉపసంహరణ(Withdrawal of Investments), పరిశ్రమలపై వేధింపులు(Harassment of Industries), రాజకీయ జోక్యాల ఆరోపణలతో పారిశ్రామికంగా వెనుకడుగు వేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సిమెంట్, బీర్లు, పారిశ్రామిక రవాణా, పోర్టులు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో అధికార పార్టీ నేతల జోక్యం, కమీషన్ల డిమాండ్లు, కాంట్రాక్టుల కోసం ఒత్తిళ్లు రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
పల్నాడు జిల్లాలో భవ్య(Bhavya), చెట్టినాడ్ సిమెంట్స్(Chettinad Cements) సంస్థలపై ఒత్తిళ్లు, జమ్మలమడుగులో అల్ట్రాటెక్ (UltraTech) ప్లాంట్ల కార్యకలాపాలకు ఆటంకాలు, రణస్థలంలోని యూబీ బీర్ ఫ్యాక్టరీ వ్యవహారం, కర్నూలులో పారిశ్రామిక రవాణాపై కమీషన్ల వివాదాలు వంటి ఘటనలు రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక భారతి సిమెంట్స్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా పరిశ్రమలకు ప్రభుత్వ రక్షణ, శాంతిభద్రతల నిర్వహణపై చర్చకు దారితీశాయి.
ఇదే సమయంలో తోలుత కడప స్టీల్ ప్లాంట్ (Kadapa Steel Plant) నుంచి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ నిష్క్రమణ (JSW Group), పారిశ్రామికవేత్తలపై నమోదైన వివాదాస్పద కేసులు, విశాఖలో (Visakhapatnam) భూముల కేటాయింపులపై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర పెట్టుబడి వాతావరణంపై మరిన్ని సందేహాలను రేకెత్తిస్తున్నాయి. మరోవైపు, కూటమి ప్రభుత్వం ప్రకటిస్తున్న భారీ పెట్టుబడి గణాంకాలకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, నీతి ఆయోగ్ సూచికలతో వ్యత్యాసం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో 4,520 ఎంఎస్‌ఎంఈలు (MSMEs) మూతపడగా 48,477 మంది ఉపాధి కోల్పోయారని, రూ.12,890 కోట్ల విలువైన కొన్ని పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని పేర్కొంటున్నారు. అలాగే పెట్టుబడుల అనుకూలతకు సంబంధించిన ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ దిగజారి ఎనిమిదో స్థానానికి పడిపోయిందన్న వాదన కూడా పారిశ్రామిక రంగంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపధ్యంలో ఏపీ మళ్ళీ పురోగతి సాధించాలి అంటే తక్షణం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచడం, పరిశ్రమలకు భద్రత కల్పించడం, రాజకీయ జోక్యాలకు తావులేని పారదర్శక పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కీలకంగా మారిందని పారిశ్రామికరంగ నిపుణుల నుండి వినిపిస్తున్న మాట. ఆ దిశగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అడుగులు వేసే వాతావరణం కనిపించడంలేదని ఇది చాలా ప్రమాదకరమైన దోరణని పలువురు హెచ్చరిస్తున్నారు.





