---Advertisement---

బ్రాండ్‌ల ముసుగులో బ్యాక్‌డోర్ బాగోతం.. విశాఖ భూముల నుంచి డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వరకు ఒకే మోడస్ ఆపరాండి?

August 17, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక భూ కేటాయింపులు, డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలకు రోజు రోజుకూ బలం చేకూరుతోంది. పెద్ద సంస్థలు, ప్రముఖ క్రీడాకారుల పేర్లను ముందుకు తెచ్చి, వాటి వెనుక అర్హత లేని సంస్థలు లేదా వ్యక్తులకు ప్రయోజనాలు కల్పిస్తున్నారంటూ చేస్తున్న విమర్శల్లో నిజం లేకపోలేదని, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రజల్లో చర్చ మొదలైంది. విశాఖపట్నంలో విలువైన భూముల కేటాయింపుల నుంచి డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాల వరకు ఒకే తరహా ‘ఫ్రంట్ అండ్ బ్యాక్’ విధానం కొనసాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విశాఖ భూ కేటాయింపుల విషయంలో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలను ముందుకు చూపిస్తూ, మరోవైపు అనుభవం లేని సంస్థలకు తక్కువ ధరలకు విలువైన భూములు కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎకరం కోట్ల రూపాయల విలువ చేసే భూములను నామమాత్రపు ధరలకు లేదా తక్కువ లీజు రేట్లకు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వైఎస్సార్‌సీపీ పేర్కొంది.

ఇదే తరహాలో డీఎస్సీ–2025 నియామకాల్లోనూ మెరిట్‌కు బదులుగా రాజకీయ అనుకూలతలకు ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. నారా లోకేష్ డీఎస్సీ స్కామ్‌పై మాట్లాడుతూ పీవీ సింధు పేరు ప్రస్తావించడంతో, పీవీ సింధు వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి పేరును అడ్డం పెట్టుకుని ఇక్కడ కూడా అర్హత లేని అభ్యర్థులకు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు కట్టబెట్టే ప్రయత్నం జరిగిందనే చర్చకు మరింత బలం చేకూరింది.

కృష్ణా జిల్లా టాపర్ నవీన్‌కు ఉద్యోగం దక్కకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని, పోలవరానికి చెందిన జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్ గిరిజన అథ్లెట్ అనిగి దుర్గయ్యకు కూడా అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. సాఫ్ట్‌బాల్, జూడో అసోసియేషన్లకు సంబంధించిన స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల విషయంలోనూ అధికార పార్టీ నాయకుల రాజకీయ సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తింది.

అక్రమాలపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో జీవో 47ను రద్దు చేసి, రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ జీవో 56ను తీసుకురావడం ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించినట్లేనని వైఎస్సార్‌సీపీ విమర్శించింది. దీంతో భూ కేటాయింపుల్లో ప్రజా ఆస్తులకు నష్టం, ఉద్యోగ నియామకాల్లో మెరిట్‌కు నష్టం జరుగుతోందనే చర్చ మొదలైంది.

ఈ నేపధ్యంలో మొత్తం వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి, ముఖ్యంగా విశాఖ భూ కేటాయింపులు, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే, కూటమి పాలనలో ప్రతి అంశంలోనూ బ్రాండ్‌ల ముసుగులో బ్యాక్‌డోర్ బాగోతం నడుస్తోందనే ఆరోపణలు జోరందుకున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment