పైకి మాత్రం ఐక్యతను ప్రదర్శిస్తున్న జనసేన–తెలుగుదేశం (Jana Sena-TDP) కూటమిలో అంతర్గత విభేదాలు క్రమంగా ముదురుతున్నాయా? కూటమి (Alliance) 15 ఏళ్లకు తగ్గకుండా కొనసాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆకాంక్షిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం (Coordination) లోపిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. జనసేన నాయకులు, కార్యకర్తలకు టీడీపీ(TDP) నుంచి తగిన గౌరవం దక్కడం లేదనే అసంతృప్తి ఒకవైపు ఉంటే, చంద్రబాబు (Chandrababu Naidu) తమ పార్టీ కార్యకర్తల కంటే పవన్ కళ్యాణ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన టీడీపీ క్యాడర్లో మరోవైపు అసహనానికి కారణమవుతోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఇటీవల ఇరు పార్టీల కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వివాదాలు, బహిరంగ విమర్శలు, పరస్పర ఆరోపణలు పెరగడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. నందమూరి తారకరామారావును (NTR) నాగబాబు (Nagababu) కుమారుడి సినిమాలో కావాలనే ట్రోల్ (Troll) చేశారనే విషయంలో సోషల్ మీడియాలో చోటుచేసుకున్న వివాదం సందర్భంగా టీడీపీ, జనసేన శ్రేణులు పరస్పరం విమర్శలకు దిగడం, ఈ వ్యవహారంపై టీడీపీ అగ్రనాయకత్వం నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడం కూడా క్యాడర్లో అసంతృప్తికి దారితీసిందనే వాదనలు ఉన్నాయి.
మరోవైపు ఒంగోలులో(Ongole) టీడీపీ–జనసేన మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు బహిరంగ ఆరోపణలు, సవాళ్ల వరకు వెళ్లడం కూడా కూటమిలోని అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తింది. క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడం కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య ఉన్న దూరాన్ని బయటపెడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కొంతకాలంగా కొన్ని కేబినెట్ సమావేశాలకు హాజరుకాకపోవడం, పలు కలెక్టర్ల సమావేశాలకు దూరంగా ఉండటం వంటి పరిణామాలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తన పాత్రపై సందేహాలు వ్యక్తమయ్యేలా పరిణామాలు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport) ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూటమి నేతలు ఒకే వేదికపై కనిపించినప్పటికీ, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన ప్రసంగంలో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) ప్రస్తావించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
తాజాగా అమరావతి (Amaravati) రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుల (Capital Development Projects) ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Ponguru Narayana) ఆహ్వానించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యేలు–ఎమ్మెల్సీల నివాస సముదాయాలు, రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్–2 వంటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హాజరుకానుండగా, పవన్ కళ్యాణ్ మాత్రం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉందని తెలిపారు.
రాష్ట్రంలో జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించాలన్న తన అభ్యర్థన మేరకే విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమం జరుగుతోందని పవన్ కళ్యాణ్ వివరించినప్పటికీ, ఒకే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు నేతల కార్యక్రమాలు ఒకే రోజున ఇలా వేర్వేరు దిశల్లో సాగడం రాజకీయ చర్చకు కారణమవుతోంది. అమరావతి ప్రాజెక్టులపై జరుగుతున్న విమర్శలు, అవినీతి ఆరోపణల(Corruption Allegations) నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం వెనుక రాజకీయ కారణాలున్నాయా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం జనసేన–టీడీపీ మధ్య సమన్వయంపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కూటమి బయటకు ఐక్యతను ప్రదర్శిస్తున్నప్పటికీ, లోపల మాత్రం విభేదాల గ్యాప్ పెరుగుతోందా? అనే చర్చ ప్రారంభమైంది. రానున్న రోజుల్లో ఇరు పార్టీల అగ్రనాయకత్వం వ్యవహరించే తీరు ఇంకెన్నీ ప్రశ్నలకు ఆస్కారం ఇవ్వనుందో చూడాలి.





