మాజీ సీబీఐ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు (Mannem Nageswara Rao) మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పాలనా విధానాలు, రాజకీయ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. గతంలోనూ చంద్రబాబు తీసుకున్న విధాన నిర్ణయాలపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నలు సంధించిన నాగేశ్వరరావు.. తాజాగా విద్యుత్ రంగ సంస్కరణల Power Sector Reforms) విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
దేశంలో విద్యుత్ రంగ సంస్కరణలకు తానే తొలిసారిగా శ్రీకారం చుట్టానన్న చంద్రబాబు వ్యాఖ్యలను నాగేశ్వరరావు ఖండించారు. దేశంలో విద్యుత్ రంగ సంస్కరణలకు తొలి అడుగు వేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదని, ఒడిశా(Odisha) అని పేర్కొన్నారు. 1992లో అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ విస్తృత సంప్రదింపులతో సంస్కరణల ప్రక్రియను ప్రారంభించారని, అనంతరం జేబీ పట్నాయక్ (J. B. Patnaik) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకెళ్లి 1995లో ఒడిశా విద్యుత్ సంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చిందని వివరించారు.
ఒడిశా విద్యుత్ నియంత్రణ మండలి (OERC) ఏర్పాటు, అప్పటి రాష్ట్ర విద్యుత్ సంస్థ (OSEB)ను ఉత్పత్తి, పంపిణీ విభాగాలుగా విభజించడం వంటి కీలక చర్యలు 1995 నాటికే అమల్లోకి వచ్చాయని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇవన్నీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి ముందే జరిగిపోయినవేనని గుర్తుచేశారు.
అంతేకాకుండా, విద్యుత్ సంస్కరణల ఘనతను జేబీ పట్నాయక్ (J. B. Patnaik) తన ఖాతాలో వేసుకోకుండా మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత బిజూ పట్నాయక్‌కు (Biju Patnaik) కూడా ఇచ్చారని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇతరుల కృషిని తన ఖాతాలో వేసుకోవడం, సొంత ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వడం, తన తప్పులకు ఇతరులను నిందించడం గౌరవప్రదమైన నాయకత్వ లక్షణాలు కావని, అది నైతిక పతనానికి సంకేతమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదే క్రమంలో ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను (Three Children) కనాలన్న చంద్రబాబు విధానాన్ని కూడా నాగేశ్వరరావు గతంలో విమర్శించారు. ఆ విధానాన్ని ముందుగా సీఎం తన కుటుంబంలోనే ఆచరించాలని, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh), బ్రాహ్మణి (Brahmani) మరో ఇద్దరు పిల్లలను కనాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అనే నానుడిని చంద్రబాబు పాటించాలని, లేకపోతే ‘ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు’ అన్న సామెత నిజమవుతుందని అన్నారు.
ప్రజలు పొదుపు పాటించాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపుపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. సైకిల్‌పై సచివాలయానికి వెళ్లే ప్రచార కార్యక్రమాల కంటే, సీఎం, మంత్రులు, పార్టీ నేతలు అధికారికంగా లేదా వ్యక్తిగతంగా చార్టర్డ్ విమానాల్లో(Chartered Flights) ప్రయాణించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి, వాటిని కఠినంగా అమలు చేయాలని సూచించారు. అలాంటి చర్యలు తీసుకోకుండా ప్రజలకు మాత్రమే పొదుపు గురించి చెప్పడం వల్ల ప్రయోజనం లేదని విమర్శించారు.
చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న వ్యక్తిగా గతంలో గుర్తింపు పొందిన మాజీ అధికారి నాగేశ్వరరావు ఇటీవలి కాలంలో ఆయన విధానాలపై వరుసగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సొంత వర్గంగా భావించే వ్యక్తుల నుంచే ఇలాంటి విమర్శలు వస్తున్నాయంటే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చనే చర్చ కూడా సాగుతోంది.





