తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (Sowcar Janaki) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 95 ఏళ్ల వయసున్న ఆమె కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో (Respiratory Problems) బాధపడుతున్నారు.
ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఆమెను చెన్నైలోనిChennai) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అయితే బుధవారం రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు ఐసీయూకి(ICU) తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
షావుకారు జానకి 1950లో విడుదలైన షావుకారు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని షావుకారు జానకిగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
తన సుదీర్ఘ నటనా ప్రయాణంలో ఆమె దాదాపు 400 చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ తన నటనతో ప్రేక్షకులను అలరించారు.
ప్రస్తుతం షావుకారు జానకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమె త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.






