తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడు శాసనసభలో సోమవారం పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. పేద, అల్పాదాయ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకాన్ని ప్రకటించారు.
ఈ పథకం కింద రూ.2.5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు. 2027 సంక్రాంతి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు దీని ద్వారా నేరుగా ప్రయోజనం చేకూరనుంది.
లబ్ధిదారులు ముందుగా గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.4,000 కోట్లను ఖర్చు చేయనుంది.
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ సరఫరాపై ప్రభావం పడటంతో పాటు ధరలు కూడా భారీగా పెరిగాయని విజయ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం, ఎన్నికల హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
మరోవైపు ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా సీఎం విజయ్ ప్రకటించారు. మహిళల కోసం అమలు చేస్తున్న ‘వెట్రి పయనం’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరించారు.
ఇప్పటివరకు సాధారణ, కొండ ప్రాంత బస్సుల్లో 40 కిలోమీటర్ల పరిమితితో ఉన్న ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఇకపై ఎక్స్‌ప్రెస్, ఎల్‌ఎస్‌ఎస్, డీలక్స్, అంతర్‌జిల్లా బస్సు సర్వీసులకు కూడా వర్తింపజేయనున్నారు. రవాణా ఖర్చుల కారణంగా ఏ మహిళ కూడా అవకాశాలను కోల్పోకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి విస్తరించిన ఉచిత బస్సు ప్రయాణ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇక చెన్నై సమీపంలోని పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయ నిర్మాణానికి రైతులు, స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పరందూర్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మించే ప్రసక్తే లేదని సీఎం విజయ్ స్పష్టం చేశారు.
రైతులను ఖాళీ చేయించకుండా, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
అదే సమయంలో ప్రస్తుతం మీనంబాక్కంలో ఉన్న చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోనే కొత్తగా ‘టెర్మినల్ 5’ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు విజయ్ శాసనసభలో ప్రకటించారు. సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతుల అభివృద్ధిపైనా తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఈ నిర్ణయాలతో స్పష్టమవుతోంది.







