పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, ప్రాజెక్టు నిర్మాణ చరిత్రను వక్రీకరించి క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టుకు శిలాఫలకం మాత్రమే చంద్రబాబు హయాంలో పడిందని, కానీ ప్రాజెక్టుకు సంకల్పం, సమగ్ర రూపకల్పన, నిర్మాణానికి అసలు ఊపిరి పోసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని స్పష్టం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు వైఎస్సార్ స్వప్నమని, తమ ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాల నిర్మాణాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేశామని జగన్ పేర్కొన్నారు. రక్షిత మంచినీరు లేక ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వెలిగొండ ప్రాజెక్టు సంజీవనిగా నిలుస్తుందని అన్నారు.
1996లో పార్లమెంట్ ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపన చేసిన తర్వాత 2004 వరకు ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదని జగన్ ఆరోపించారు. ఆ కాలంలో వెలిగొండపై కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని, అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకేనని పేర్కొన్నారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు సమగ్ర రూపం ఇచ్చారని జగన్ తెలిపారు. జంట సొరంగాలు, నల్లమలసాగర్, మూడు డ్యామ్‌లు, ఫీడర్ ఛానల్, ప్రధాన కాలువల నిర్మాణంతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని వివరించారు. ప్రాజెక్టుకు ప్రాణమైన 37.587 కిలోమీటర్ల జంట సొరంగాల్లో వైఎస్సార్ హయాంలో 20.333 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని, 2014–19 మధ్య కేవలం 6.686 కిలోమీటర్ల తవ్వకం మాత్రమే చంద్రబాబు గారి పాలనలో జరిగిందని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో కరోనా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే మిగిలిన అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తిచేశామని జగన్ అన్నారు. టన్నెల్–1ను 2021 జనవరిలో, టన్నెల్–2ను 2024 జనవరిలో పూర్తి చేసి, 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశామని గుర్తుచేశారు.

జంట సొరంగాలు సిద్ధమైన తర్వాత కూడా 26 నెలలపాటు నిర్వాసితుల పునరావాసం పూర్తి చేయకపోవడం, నల్లమలసాగర్‌కు నీటిని తరలించకపోవడంపై జగన్ ప్రశ్నలు సంధించారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందకపోవడం, గ్రామాల్లో విద్యుత్, తాగునీటి సరఫరాపై వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రచార ఆర్భాటం కంటే వెలిగొండ ద్వారా రైతులకు సాగునీరు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. అలాగే పెద్దదోర్నాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాలను ప్రభుత్వ రంగంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.





