---Advertisement---

ఉద్యోగుల పోరాటానికి రాజకీయ అజెండా అంటకడతారా? ఏపీ జేఏసీ ఆగ్రహం.

August 30, 2026

Summarize with AI

---Advertisement---

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం పూర్తిగా ఉద్యోగుల హక్కులు, పెండింగ్ బకాయిలు, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసమేనని ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లను రాజకీయ అజెండాగా చిత్రీకరించడం సరికాదని ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హామీలు అమలు చేయాలని కోరడం రాజకీయమా అంటూ ప్రశ్నించారు.

ఈ నెల 28న జరిగిన సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సామరస్యపూర్వక చర్చలకు ఉద్యోగ సంఘాలు విఘాతం కలిగించాయని, సీఎంను అవమానించేలా కుట్రపూరితంగా మాట్లాడారని ప్రభుత్వం ఆరోపించడం వాస్తవాలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడో సంవత్సరం కొనసాగుతున్నప్పటికీ, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసమే తాము పోరాడుతున్నామని తెలిపారు.

ఉద్యమం చేపట్టే పరిస్థితికి వెళ్లిన ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని గుర్తుచేసిన బొప్పరాజు, ఐదుగురు మంత్రులు, పది మంది ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ అనేక అంశాలపై చర్చించినప్పటికీ నలభై రోజులుగా వాటిపై అమలు చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. చర్చల అనంతరం వాటి సారాంశాన్ని ప్రభుత్వం ఎందుకు వెల్లడించలేదని నిలదీశారు.

ప్రతి నెల ఉద్యోగులు తమ జీతంలో 25 శాతం వరకు నష్టపోతున్న పరిస్థితిలో ఇక ఎంతకాలం ఓపిక పట్టాలని ఆయన ప్రశ్నించారు. పెండింగ్ బకాయిల వివరాలను పే స్లిప్‌లలో చూపించాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రకటన ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంగా ఉందని ఆరోపిస్తూ, ఏపీ జేఏసీ అమరావతికి ఎలాంటి రాజకీయ అజెండా లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment