---Advertisement---

వెలిగొండ ప్రాజెక్ట్: ‘క్రెడిట్ చోరీ’ వాస్తవాలు.

August 31, 2026

Summarize with AI

---Advertisement---

రాజకీయాల్లో శిలాఫలకాలు వేయడం, కెమెరాల ముందు ప్రచారం చేసుకోవడం సులభమే. కానీ కొండలను తొలిచి, భారీ సొరంగాలను నిర్మించి, కరువు ప్రాంతాలకు నీటిని అందించే ప్రాజెక్టును సాకారం చేయడం మాత్రం అకుంఠిత దీక్షతో కూడిన ఒక యజ్ఞం. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల జీవనాడిగా భావించే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు ఎవరి కృషి ఎంత అన్న ప్రశ్న మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది.

చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఈ ప్రాజెక్టు(Project) తన మానసపుత్రిక అని చెప్పుకుంటున్న నేపథ్యంలో, ప్రాజెక్టు చరిత్ర(Project History), నిర్మాణ పురోగతి(Construction Progress), సొరంగాల తవ్వకం గణాంకాలు(Tunnel Excavation Statistics) మాత్రం భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు. కేవలం శంకుస్థాపన చేయడం అభివృద్ధి కాదని, ప్రతిపాదనను వాస్తవ ప్రాజెక్టుగా మార్చి పూర్తి చేయడమే అసలైన కృషి అని వారు వాదిస్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) ఆలోచనకు మూలాలు 1970ల నాటివి. కృష్ణా జలాలను కంభం చెరువుకు మళ్లించి కరువు ప్రాంతాలను ఆదుకోవాలనే లక్ష్యంతో 1972-73లో ప్రజా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 1973 సెప్టెంబర్ 1న కృష్ణా జలాల సాధనా సంఘం ఏర్పడగా, తదుపరి సంవత్సరాల్లో ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిగాయి. 1982లో నల్లమల కొండల గుండా సొరంగ మార్గం ద్వారా నీటిని మళ్లించే అంశంపై ఫీజిబిలిటీ నివేదికకు ఆదేశాలు జారీ అయ్యాయి. 1983లో జీఓ 409 ద్వారా ప్రాథమిక సర్వేలకు అనుమతులు లభించాయి.

1994లో తొలి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(Detailed Project Report – DPR) సిద్ధమైంది. అనంతరం 1996 మార్చి 5న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొట్టిపడియ వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే, ఆ తర్వాతి తొమ్మిదేళ్ల కాలంలో నిర్మాణ పనులు గణనీయంగా ముందుకు సాగలేదని విమర్శలు ఉన్నాయి. శంకుస్థాపన జరిగినప్పటికీ ప్రాజెక్టు వాస్తవ నిర్మాణ దశలోకి వెళ్లలేదన్నది ప్రధాన ఆరోపణ. నాడు కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పోందేందుకే హడావిడిగా ఒక రాయిని(Foundation Stone) చంద్రబాబు వేశారని విమర్శలు ఉన్నాయి.

ఆ విమర్శకు తగ్గట్టుగా ఇదే సమయంలో శ్రీశైలం జలాశయం కనీస నీటిమట్టం తగ్గింపుపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కూడా వెలిగొండ ప్రాజెక్టు నీటి లభ్యతపై ప్రభావం చూపాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. టన్నెల్ ఇన్‌లెట్ స్థాయికి(Tunnel Inlet Level) సంబంధించి నీటి మట్టం తగ్గడం వల్ల గురుత్వాకర్షణ ద్వారా నీటిని తరలించే అవకాశం దెబ్బతింటుందని అప్పట్లో నిపుణులు అభిప్రాయపడినట్లు విమర్శకులు చెబుతున్నారు.

2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకు కొత్త ఊపిరి లభించిందని ప్రాజెక్టు చరిత్రను పరిశీలించిన వారు పేర్కొంటున్నారు. జలయజ్ఞంలో(Jalayagnam) భాగంగా ప్రాజెక్టు రూపకల్పనను విస్తరించి, పరిమిత సామర్థ్యం గల సింగిల్ టన్నెల్ ప్రతిపాదన స్థానంలో భారీ సామర్థ్యంతో కూడిన జంట సొరంగాల వ్యవస్థను రూపొందించారు. 2005లో రీ-డిజైన్ చేసిన ప్రాజెక్టులో 7 మీటర్లు, 9.2 మీటర్ల వ్యాసంతో రెండు భారీ టన్నెల్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

నల్లమలసాగర్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాపులు వంటి కీలక నిర్మాణాలను పూర్తిచేశారు. ఆధునిక టన్నెల్ బోరింగ్ యంత్రాలను వినియోగిస్తూ 2008 నుంచి సొరంగాల తవ్వకాన్ని వేగవంతం చేశారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో మొత్తం 20.333 కిలోమీటర్ల మేర సొరంగ తవ్వకం పూర్తవడం ప్రాజెక్టు చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచింది. ఇది మొత్తం సొరంగ తవ్వకంలో 54.1 శాతంగా పేర్కొంటున్నారు.

అయితే 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు కాలంలో పనుల వేగం తగ్గిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఐదేళ్లలో కేవలం 6.686 కిలోమీటర్ల మేర మాత్రమే సొరంగ తవ్వకం జరిగిందని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది మొత్తం పనిలో 17.8 శాతం మాత్రమే. కాంట్రాక్టు నిబంధనలు, ధరల సర్దుబాటు, టన్నెల్ బోరింగ్ యంత్రాల నిర్వహణ వంటి అంశాలపై కాగ్ నివేదికలో(CAG Report) కూడా అభ్యంతరాలు వ్యక్తమైనట్లు విమర్శకులు గుర్తు చేస్తున్నారు.

2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెలిగొండ పనులను మళ్లీ వేగవంతం చేశారు. రివర్స్ టెండరింగ్(Reverse Tendering) ద్వారా ఖర్చులను తగ్గిస్తూ నిలిచిపోయిన పనులకు ఊపునిచ్చారు. నాగార్జునసాగర్-శ్రీశైలం (Nagarjunasagar-Srisailam) పులుల అభయారణ్య పరిధిలో ఉండటం, పర్యావరణ పరిమితులు, సొరంగాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు, యంత్రాల తరలింపులో ఇబ్బందులు వంటి అసాధారణ సవాళ్ల మధ్య పనులు కొనసాగాయి.

టీబీఎంలు (TBMs) పనిచేయని ప్రాంతాల్లో డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిని (Drill and Blast Method) ఉపయోగించడం, క్రాస్ పాసేజీల (Cross Passages) ద్వారా సొరంగ నిర్మాణాన్ని కొనసాగించడం వంటి సాంకేతిక పరిష్కారాలతో పనులు పూర్తి చేశారు. తొలి టన్నెల్ బ్రేక్‌థ్రూ 2021 జనవరి 13న జరగగా, రెండో టన్నెల్ బ్రేక్‌థ్రూ 2024 జనవరిలో పూర్తయింది. అనంతరం 2024 మార్చి 6న రెండు టన్నెల్‌లను జాతికి అంకితం చేశారు.

సొరంగాల తవ్వకం గణాంకాలను పరిశీలిస్తే వెలిగొండ ప్రాజెక్టులో ఎవరి హయాంలో ఎంత పని జరిగిందనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపిస్తుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. 2004-14 మధ్య వైఎస్సార్ హయాంలో(YSR Tenure) 20.333 కిలోమీటర్లు, 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో (Chandrababu Tenure) 6.686 కిలోమీటర్లు, 2019-24 మధ్య జగన్ హయాంలో(Jagan Tenure) 10.568 కిలోమీటర్ల మేర తవ్వకం జరిగినట్లు పేర్కొంటున్నారు.

అంటే వైఎస్సార్(YSR), జగన్ (Jagan) ప్రభుత్వాల కాలంలో కలిపి 30.901 కిలోమీటర్ల సొరంగ తవ్వకం (Tunnel Excavation) పూర్తయిందని, ఇది మొత్తం పనిలో 82.2 శాతానికి సమానమని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్‌ను కేవలం శంకుస్థాపన ఆధారంగా నిర్ణయించలేమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సరఫరా, పునరావాసం, ఫీడర్ కెనాల్ మరమ్మతులు వంటి అంశాలపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. అయితే వెలిగొండ చరిత్రను కేవలం ప్రచార కార్యక్రమాలతో తిరగరాయలేమని ప్రాజెక్టు ఉద్యమకారులు, రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

1996లో శంకుస్థాపన జరిగినా, ప్రాజెక్టును వాస్తవ నిర్మాణ దశలోకి తీసుకెళ్లి భారీ సొరంగాల నిర్మాణానికి పునాది వేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వమేనని, అత్యంత క్లిష్టమైన చివరి దశ తవ్వకాలను పూర్తి చేసి రెండు టన్నెల్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది జగన్ ప్రభుత్వమేనని వారి వాదన.

కెమెరాల ముందు ఫోజులు ఇవ్వడం, కొత్త రంగులు వేయడం వల్ల క్షేత్రస్థాయి వాస్తవాలు మారవు. ఒక శిలాఫలకం వేయడం వేరు.. కొండలను చీల్చి సొరంగాలను పూర్తి చేసి కరువు నేలకు నీరు అందించే మార్గాన్ని నిర్మించడం వేరు. వెలిగొండ ప్రాజెక్టు చరిత్రలో 30.9 కిలోమీటర్ల సొరంగ తవ్వకం, 82.2 శాతం నిర్మాణ పురోగతి ఒక రాజకీయ నినాదం కాదు.. ప్రాజెక్టు నిర్మాణ ప్రయాణాన్ని ప్రతిబింబించే కీలక గణాంకమని వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

వెలిగొండ నిర్మాణ చరిత్రలో ఎవరి హయాంలో ఎంత పని జరిగిందన్నది గణాంకాల రూపంలో స్పష్టంగా ఉన్నాయని, ఆ గణాంకాలే ఇప్పుడు ‘క్రెడిట్ చోరీ’ (Credit Theft) రాజకీయాలపై అసలు నిజం ఏమిటన్న చరిత్రను మరోసారి తెరపైకి తెస్తున్నదని నీటి రంగ నిపుణులు చెబుతున్న మాట .

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment