---Advertisement---

వెలిగొండపై చంద్రబాబు ఆర్భాటం బెడిసికొట్టిందా?

August 31, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాజకీయ శైలిలో ప్రచారానికి ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. తన ప్రమేయం పరిమితంగా ఉన్న ప్రాజెక్టుల విషయంలో కూడా ఘనమైన ప్రచారంతో రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తారనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport) నుంచి తాజాగా వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) వరకు ఇదే తరహా ప్రచార వ్యూహం కనిపించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, ఈసారి వెలిగొండ ప్రాజెక్టుపై జరిగిన భారీ ప్రచారం ఆశించిన రాజకీయ ఫలితాన్ని ఇవ్వలేదనే చర్చ సాగుతోంది.

కరువు ప్రాంతాలకు వరప్రదాయినిగా భావిస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు(Poola Subbaiah Veligonda Project) తొలి దశ ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అయితే ఈ కార్యక్రమంపై ప్రధాన ప్రతిపక్షంతో పాటు వామపక్ష పార్టీలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ప్రాజెక్టు చరిత్రను పరిశీలిస్తే చంద్రబాబు పాత్ర ఎంతవరకు ఉందనే ప్రశ్నను వారు ముందుకు తెచ్చారు.

1996 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా ప్రజల మద్దతు కోసం చంద్రబాబు శంకుస్థాపన (Foundation Stone) చేసినప్పటికీ, అనంతరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో తగిన చొరవ చూపలేదనే ఆరోపణ ఉంది. 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి(YS Rajasekhara Reddy) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాజెక్టుకు కొత్త ఊపిరి పోసి పనులను ప్రారంభించారని, ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలో మెజారిటీ నిర్మాణ పనులు (Majority Construction Works) పూర్తయ్యాయని ప్రత్యర్థులు పేర్కొంటున్నారు. మధ్యలో చంద్రబాబు మళ్లీ అధికారంలో ఉన్నప్పటికీ పనులు చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగమించలేదనే విమర్శలు ఉన్నాయి.

అత్యంత ఆసక్తికర అంశం ఏమిటంటే, వెలిగొండ ప్రాజెక్టు కోసం తొలినాళ్ల నుంచి పోరాడిన వామపక్ష, కమ్యూనిస్టు నాయకులు కూడా చంద్రబాబుకు పూర్తి క్రెడిట్ ఇవ్వడానికి ముందుకు రాకపోవడం. ప్రాజెక్టు నిర్మాణం, దాని కల సాకారంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పాత్ర కీలకమని వారు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అంతేకాకుండా, నిర్వాసితులకు ఇప్పటికీ సరైన పునరావాసం, పునర్నిర్మాణ ప్యాకేజీ అందలేదనే అంశాన్ని కూడా వారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

శ్రీశైలం జలాశయంలో(Srisailam Reservoir) ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి పరిస్థితుల కారణంగానే హడావుడిగా తొలి దశ ప్రారంభోత్సవ నిర్ణయం తీసుకున్నారని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలు పూర్తికాకముందే రాజకీయ ప్రచారం కోసం కార్యక్రమాన్ని నిర్వహించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య (Poola Subbaiah) పేరు మీద ఉన్న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ప్రచారానికి కమ్యూనిస్టు వర్గాలే దూరంగా ఉండటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఘనమైన ప్రచారం, మరోవైపు ప్రాజెక్టు చరిత్రపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా పోరాడిన వర్గాలే వైయస్సార్(YSR) పాత్రను ప్రధానంగా గుర్తిస్తుండటం, చంద్రబాబు పాత్రపై ప్రశ్నలు సంధిస్తుండటం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. దీంతో వెలిగొండ తొలి దశ ప్రారంభోత్సవాన్ని భారీ రాజకీయ విజయంగా మలచాలన్న ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని చంద్రబాబుకి ఇవ్వలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రచార ఆర్భాటం ఎంత ఉన్నప్పటికీ, ప్రాజెక్టు చరిత్రను ప్రజలు విస్మరించరనే సందేశమే ఈ పరిణామాల ద్వారా బయటపడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment