---Advertisement---

పాలకుల పబ్లిసిటీ యావ.. ప్రజల ప్రాణాలకు శాపమా?

September 1, 2026

Summarize with AI

---Advertisement---

పాలన (Governance) అంటే ప్రచారం (Publicity) కాదు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వానికి మొదటి బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) టీడీపీ(TDP) అధికారంలో ఉన్న సమయంలో వరుసగా చోటుచేసుకున్న కొన్ని విషాద ఘటనలను పరిశీలిస్తే, ప్రజల భద్రత (Public Safety) కంటే పాలకుల పబ్లిసిటీకి, ఫోటోలకు, ప్రజల ప్రాణాల కంటే రాజకీయ ఆప్టిక్స్‌కు (Political Optics) ప్రాధాన్యం పెరుగుతోందా అనే చర్చ జరుగుతోంది.

తాజా వెలిగొండ విషాదంతో(Veligonda Tragedy) ఈ చర్చ మరోసారి మరింత బలంగా తెరపైకి వచ్చింది. నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారం, పునరావాసం, గ్రామాల ఖాళీ ప్రక్రియ పూర్తి కాకముందే నీటి విడుదలకు హడావుడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయా లేదా అన్న ప్రాథమిక పరిశీలనకు ముందే పబ్లిసిటీ యావతో ప్రారంభోత్సవ రాజకీయాలు మొదలయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కలనూతల గ్రామానికి(Kalanuthala Village) చెందిన కుటుంబం వెలిగొండ నీటి ముప్పు నుంచి తప్పించుకునేందుకు బయలుదేరగా, వారి వాహనం నీటి ఉధృతిలో కొట్టుకుపోవడం విషాదానికి దారితీసింది. ఒకరు మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. దీంతో ప్రారంభోత్సవం కోసం అంత తొందర ఎందుకు? ప్రజల భద్రత నిర్ధారించకుండా నీటి విడుదల ఎందుకు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వెలిగొండ ఒక్కటే కాదు, గతంలో కూడా టీడీపీ పాలనలో ఇలాంటి నిర్లక్ష్య ఘటనలు చోటుచేసుకున్నాయన్న విమర్శలు ఉన్నాయి. బుడమేరు వరద ఉధృతి సమయంలో విజయవాడలో (Vijayawada) వేలాది మంది జలదిగ్బంధంలో చిక్కుకోవడం ప్రభుత్వ విపత్తు నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. ముందస్తు హెచ్చరికలు, ప్రజల తరలింపు, శాఖల సమన్వయం వంటి అత్యవసర చర్యల్లో లోపాలు నాడు బయటపడ్డాయి. విపత్తు వస్తున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మొదట చేయాల్సింది ప్రజలను రక్షించడం. కానీ హెచ్చరికలు ఆలస్యం కావడం, లోతట్టు ప్రాంతాల ప్రజలకు తగిన సమాచారం అందకపోవడం భారీగా ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమయ్యాయన్న విమర్శలు వచ్చాయి.

ఇక 2015 గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఇప్పటికీ ఏపీ(AP) రాజకీయ చరిత్రలో చెరగని విషాదం. వీఐపీ కార్యక్రమాలు, జనసందోహ నియంత్రణలో లోపాలు, పరిమిత మార్గాల్లో భారీ సంఖ్యలో భక్తులను డ్రోన్ షాట్ల కోసం ఒకచోటికి చేర్చడంతో చివరకు తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. భక్తుల భద్రత కంటే వీఐపీ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు అప్పట్లో తీవ్రంగా వినిపించాయి. చంద్రబాబు గారి కుటుంబం పుణ్యస్నానం కోసం వేలాది మంది భక్తుల భద్రతను పణంగా పెట్టవచ్చా అన్న ప్రశ్నకు ఇప్పటికీ రాజకీయంగా టీడీపీ దగ్గర స్పష్టమైన సమాధానం లేదన్న విమర్శలు ఉన్నాయి.

డ్రోన్ షాట్ల రాజకీయ పబ్లిసిటీ కోసం టీడీపీ కందుకూరులో నిర్వహించిన రోడ్‌షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందడం రాజకీయ సభల నిర్వహణలో ఉన్న ప్రమాదకర లోపాలను బయటపెట్టింది. ఇరుకైన ప్రదేశంలో భారీ జనసమీకరణ చేసి, డ్రోన్ షాట్ ద్వారా భారీగా ప్రజలు ఉన్నారనే భ్రమను కల్పించడానికి టీడీపీ పడిన తాపత్రయంలో సరైన క్రౌడ్ మేనేజ్‌మెంట్ లేకపోవడం సదరు విషాదానికి దారితీసిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే గుంటూరులో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కూడా ఇదే ప్రశ్నను తెరపైకి తెచ్చింది.

ఇక తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం కూడా వ్యవస్థల వైఫల్యంపై ప్రశ్నలను లేవనెత్తాయి. పవిత్ర క్షేత్రాల్లో భక్తుల సంఖ్యను ముందుగానే అంచనా వేయడం, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలను శాస్త్రీయంగా రూపొందించడం, నిర్మాణాల నాణ్యతను పర్యవేక్షించడం ప్రభుత్వ బాధ్యత. కానీ విషాదం జరిగిన తర్వాత విచారణ కమిటీ వేయడం వంటి రాజకీయ నష్టనివారణ చర్యల కంటే, విషాదం జరగకుండా ముందుగానే చూడటమే నిజమైన సమర్థవంతమైన పాలన.

వెలిగొండలో నిర్వాసితుల భద్రతపై నిర్లక్ష్యం. బుడమేరులో ముందస్తు హెచ్చరికల వైఫల్యం. పుష్కరాల్లో వీఐపీ నిర్వహణ మధ్య తొక్కిసలాట. కందుకూరులో భారీ జనసమీకరణ విషాదం. తిరుపతి, సింహాచలంలో భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలు. ఈ ఘటనలు ఒక్కొక్కటి వేర్వేరు కావచ్చు. కానీ వాటన్నింటినీ కలిపి చూస్తే ఒకే ప్రమాదకరమైన ప్రచార యావ ధోరణి కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పాలకుడు ఫోటోలో కనిపించడం కంటే ప్రజల జీవితాలకు రక్షణగా నిలవడం ముఖ్యం అన్న ధోరణి టీడీపీ పాలనలో కనిపించడం లేదనే విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ధోరణిని మార్చుకోకపోతే, ప్రతి కొత్త ప్రారంభోత్సవం వెనుక ఒక కొత్త విషాదం దాగి ఉందేమోనన్న భయం ప్రజలను వెంటాడుతూనే ఉంటుంది. పాలకుల పబ్లిసిటీకి పరిమితి ఉండాలని, జరుగుతున్న పరిణామాలను చూస్తే రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా ఇదే అభిప్రాయం వినిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment