భారత క్రికెట్ నియంత్రణ మండలి గాయపడిన ఆటగాళ్ల ఎంపిక విషయంలో కొత్త విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై ఆటగాడి ఫిట్‌నెస్‌పై (Fitness) పూర్తిస్థాయి స్పష్టత వచ్చిన తర్వాతే జట్టులో అతడి పేరును ప్రకటించే అవకాశం ఉంది.
ఇటీవల గాయాల నుంచి పూర్తిగా కోలుకోని ఆటగాళ్లు జట్టుకు ఎంపికైన తర్వాత సిరీస్‌కు దూరమైన ఘటనలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకునే దిశగా బీసీసీఐ(BCCI) అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Centre of Excellence) పనితీరుపైనా విమర్శలు వచ్చాయి.
అఫ్గానిస్థాన్‌తో (Afghanistan) జరగనున్న 3 టీ20ల సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy), జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా పేర్లకు ప్రత్యేక గుర్తులు ఉండటం గమనార్హం. వీరి ఫిట్‌నెస్‌పై తుది నిర్ధారణ ఇంకా జరగలేదని తెలుస్తోంది.
బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) తెలిపిన వివరాల ప్రకారం.. ఆటగాడు సిరీస్‌కు పూర్తిగా సిద్ధంగా లేకపోతే ఆ విషయాన్ని ముందుగానే వెల్లడిస్తారు. ఫిట్నెస్ పరీక్షలో విఫలమైతే అతడి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేసేందుకు సెలెక్టర్లకు ముందుగానే ప్రణాళిక ఉంటుంది.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) కూడా అంతర్జాతీయ సిరీస్‌కు సాధారణంగా 3 నుంచి 4 వారాల ముందే జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆ సమయంలో పూర్తిగా ఫిట్‌గా లేకపోయినా, సిరీస్ ప్రారంభమయ్యే నాటికి కోలుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లను ఫిట్‌నెస్‌కు లోబడి ఎంపిక చేస్తామని వివరించారు.
ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్‌లో పురోగతి సాధిస్తున్నట్లు సమాచారం. హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ పరిస్థితిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వైద్య బృందం పూర్తిస్థాయి ఫిట్నెస్ను నిర్ధారించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.








