---Advertisement---

నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు!

September 4, 2026

Summarize with AI

---Advertisement---

నేపాల్‌లో ప్రకృతి బీభత్సం మధ్య అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. భారీ వరదలు, కొండచరియల కారణంగా టన్నెల్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు హైడ్రోపవర్ ప్రాజెక్టు కార్మికులను 9 రోజుల తర్వాత రక్షణ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. శుక్రవారం జరిగిన ఈ ఆపరేషన్‌లో 45 ఏళ్ల కబీర్ మహర్జన్, 30 ఏళ్ల సంజయ్ సాహ్ ప్రాణాలతో బయటపడ్డారు.

మొదట కబీర్ మహర్జన్‌ను, ఆ తర్వాత సంజయ్ సాహ్‌ను టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న వీరిద్దరూ మట్టి, రాళ్లతో పూర్తిగా మూసుకుపోయిన టన్నెల్‌లో చిక్కుకున్నారు. కబీర్ మెకానికల్ సూపర్‌వైజర్‌గా, సంజయ్ ఫోర్‌మన్‌గా పనిచేస్తున్నారు.

టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను గుర్తించడం రెస్క్యూ బృందాలకు పెద్ద సవాలుగా మారింది. నేపాల్ ఆర్మీ నేతృత్వంలోని భద్రతా బలగాలు ప్రత్యేక పరికరాలతో గాలింపు చేపట్టగా.. టన్నెల్ లోపలి నుంచి కార్మికుల స్వరాలు వినిపించడంతో వారితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేశారు. అనంతరం తీవ్రంగా శ్రమించి ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

నేపాల్‌లో వరదల బీభత్సం.. 1,282 మంది మృతి

మరోవైపు ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో ఐస్-రాక్ అవలాంచ్ కారణంగా భారీ ఆకస్మిక వరదలు సంభవించాయి. ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శుక్రవారం నాటికి ఈ విపత్తులో మృతుల సంఖ్య 1,282కు చేరుకోగా.. మరో 4,700 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

వందలాది మంది పిల్లలు, ఉపాధ్యాయులు గల్లంతు

వరదల ప్రభావంతో రసువా, నువాకోట్ జిల్లాల్లో వందలాది మంది పిల్లలు గల్లంతైనట్లు స్థానిక విద్యాశాఖల ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. రసువాలో సుమారు 280 మంది, నువాకోట్‌లో 300 నుంచి 350 మంది పిల్లల ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. బిదూర్ మున్సిపాలిటీలోనే సుమారు 250 మంది పిల్లలు గల్లంతైనట్లు సమాచారం.

అదేవిధంగా రసువా, నువాకోట్ జిల్లాల్లో కలిపి 22 మంది ఉపాధ్యాయులు, విద్యా సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో రసువాకు చెందిన 16 మంది, నువాకోట్‌కు చెందిన 6 మంది ఉన్నారు.

ఇద్దరు కార్మికులను సురక్షితంగా రక్షించడం రెస్క్యూ బృందాలకు భారీ విజయంగా నిలిచినా.. మరోవైపు వేలాది మంది గల్లంతైన వారి కోసం నేపాల్ భద్రతా బలగాల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment