2025లో ప్రభుత్వ పాఠశాలల్లో(Government Schools) జ్వరాలు (Fevers) ప్రబలుతున్నాయని, పరిస్థితిని పట్టించుకోవాలని కోరినప్పుడు.. “పిల్లలకు జ్వరాలు వస్తే మంత్రి బాధ్యతా?” అంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Gummadi Sandhyarani) చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. 2026లో అదే సమస్య మరింత విషాదకర రూపం దాల్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్వరాల నివారణ పేరుతో విద్యార్థులకు (Students) మాత్రలు అందించిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పిల్లల ఆరోగ్యం(Children’s Health), భద్రత (Safety) విషయంలో ప్రభుత్వం కనీస బాధ్యతతో వ్యవహరిస్తుందా? పసిపిల్లల ప్రాణాల విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు? అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజీనామా (Resignation) చేయాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఆహార భద్రతపై కూడా వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు పెరుగుతున్నాయని, బీసీ హాస్టల్‌ను (BC Hostel) సందర్శించిన సమయంలో హోంమంత్రి ప్లేట్లోనే పురుగు కనిపించిందనే ఘటనపై విమర్శలు వచ్చాయి. విద్యార్థులకు నాణ్యత లేని, కుళ్లిన గుడ్లు అందిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో తాగునీటి సౌకర్యాలు (Drinking Water Facilities) సరిగా లేక విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని, డయేరియా వంటి సమస్యలతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ఆరోగ్యం, ఆహార భద్రతపై పాలకుల నిర్లక్ష్యం బయటపడుతోందని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పిల్లల ప్రాణాల విషయంలో గతంలో ఎన్నడూ లేనంత నిర్లక్ష్యం ప్రస్తుతం విద్యాశాఖలో కనిపిస్తోందని, ఇది పాలనా వైఫల్యమే కాక విద్యాశాఖ మంత్రిత్వ శాఖ పనితీరుపైనా ప్రశ్నలు లేవనెత్తుతోందని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి.





