---Advertisement---

పోలవరం నీళ్లపై చంద్రబాబు ప్రచారానికి జగన్ బ్రేక్.. అసలు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలంటూ నిలదీత!

September 2, 2026

Summarize with AI

---Advertisement---

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) నేడు పోలవరం కుడి కాలువ (Polavaram Right Canal) ద్వారా నీటిని విడుదల చేసిన నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు. పోలవరం నుంచి గ్రావిటీ(Gravity) ద్వారా వచ్చిన నీటిని విడుదల చేసినట్టు ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన విమర్శించారు. ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం(Purushothapatnam Lift Irrigation Scheme), పంపుల ద్వారా గోదావరి నీటిని ఎత్తి ఇప్పటికే నిర్మితమైన పోలవరం ఎడమ కాలువలోకి విడుదల చేసి, దానికి పోలవరం నీళ్లుగా ప్రచారం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

పురుషోత్తపట్నం నుంచి విడుదల చేస్తున్న 3,500 క్యూసెక్కుల నీరు, అక్కడి పంపులు కొత్తవి కాదని జగన్ పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79 శాతం పనులు వైఎస్సార్‌(YSR) హయాంలోనే పూర్తయ్యాయని, గతంలో చేపట్టిన పనులపై నిలబడి ఇప్పుడు మొత్తం క్రెడిట్‌(Credit) తీసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వరుసగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) విషయంలో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోయిందని జగన్ ఆరోపించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యాంల పనులను అరకొరగా చేపట్టడం, నదీ ప్రవాహాన్ని సక్రమంగా మళ్లించకుండానే డయాఫ్రంవాల్‌ పనులు చేపట్టడం వల్ల వరదల సమయంలో డయాఫ్రంవాల్‌కు నష్టం జరిగిందని పేర్కొన్నారు. తమ ఐదేళ్ల పాలనలో అప్రోచ్‌ ఛానల్‌, స్పిల్‌ ఛానల్‌, స్పిల్‌వే, కాఫర్‌ డ్యాంలను పూర్తి చేసి, అనంతరం మెయిన్‌ డ్యాం పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లామని తెలిపారు.

అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి ఎత్తుపై చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. పోలవరం నిర్దేశిత పూర్తి ఎత్తు 45.72 మీటర్లు కాగా, నీటి నిల్వను(Water Storage) 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. 41.15 మీటర్ల వరకు మాత్రమే కేంద్రం నిధులు ఇస్తే పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని, పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారని, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఎప్పుడు అందిస్తారని నిలదీశారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కూడా జగన్(YS Jagan) ప్రశ్నలు సంధించారు. పురుషోత్తపట్నం పంపుల నుంచి నీటిని విడుదల చేయడం ద్వారా ఉత్తరాంధ్రకు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరదని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌ హయాంలో ఈ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని, తమ ప్రభుత్వంలో అంచనాలను సవరించి కీలక పనులను టెండర్లు, అగ్రిమెంట్ల దశకు తీసుకెళ్లామని గుర్తుచేశారు.

చివరగా పోలవరం విషయంలో ప్రచార ఆర్భాటాలను పక్కనపెట్టి పనులపై దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. 41.15 మీటర్లకే పరిమితం కాకుండా 45.72 మీటర్ల నిర్దేశిత ఎత్తులో ప్రాజెక్టును పూర్తి చేస్తే పూర్తి స్థాయి నీటి నిల్వ సాధ్యమవుతుందని, తద్వారా కుడి, ఎడమ కాలువలకు గ్రావిటీ ద్వారా నీటిని అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాలపై ఆధారపడకుండా పోలవరం ద్వారా పూర్తి గ్రావిటీ నీటిని అందించగలిగినప్పుడు, ప్రస్తుతం జరుగుతున్న ప్రచార కార్యక్రమాల అవసరం ఏమిటని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment