కాదంబరి జెత్వానీ(Kadambari Jethwani) కేసు పేరుతో గతంలో సస్పెన్షన్‌కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా(Kanthi Rana Tata), విశాల్ గున్నీలపై(Vishal Gunni) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరిద్దరి సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ, తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే సమయంలో, ఇటీవల సీఐడీ (CID) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో(Charge Sheet) కాదంబరి జెత్వానీపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందె, కుక్కల విద్యాసాగర్‌ను(Kukkala Vidhyasagar) బెదిరించి రూ.1.32 కోట్లు వసూలు చేసినట్లు సాంకేతిక, బ్యాంకు ఆధారాలతో దర్యాప్తు సంస్థ నిర్ధారించిందని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇద్దరు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేత రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఈ కేసును అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకునే క్రమంలో నిబంధనల ప్రకారం వ్యవహరించిన అధికారులను బలిచేశారనే ఆరోపణలు గతంలో వినిపించాయి. అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా, వారిపై తీవ్ర దుష్ప్రచారం జరిగిందనే విమర్శలు కూడా వచ్చాయి.
ఇప్పుడు అదే అధికారులను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో, గతంలో వారిపై తీసుకున్న చర్యల వెనుక అసలు కారణాలేమిటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం అధికారులను బలిపశువులుగా మార్చారా? అనే ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.






