స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉండటంతో కూటమి ప్రభుత్వ దృష్టి మరోసారి సంక్షేమ పథకాలపైకి మళ్లినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త పెన్షన్ల వ్యవహారం అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టినా ఇప్పటివరకు కొత్త పెన్షన్ల మంజూరుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం.. ఎన్నికల వేళ టీడీపీ స్థానిక నేతల్లో ఆందోళనకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.
గ్రామాల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు ప్రజల నుంచి పెన్షన్లపై ప్రశ్నలు ఎదురవుతున్నా.. ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందనే ప్రచారం సాగుతోంది. స్థానిక ఎన్నికల నాటికి కొత్త పెన్షన్లు ఇవ్వకపోతే రాజకీయంగా నష్టం తప్పదనే అభిప్రాయం టీడీపీ మండల స్థాయి నేతల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆరు నెలలకోసారి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి, అర్హత ఉన్న వారికి మంజూరు చేసే ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల ఏడాదిలోనూ సంక్షేమ క్యాలెండర్ ప్రకారం కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడిందని, అప్పటి నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించే పరిస్థితి కూడా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
దాదాపు మూడేళ్లుగా కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతు మహిళలు ప్రతి గ్రామంలోనూ ఉన్నారని, ఒక్కో మండలానికి కనీసం 2 వేల వరకు కొత్త పెన్షన్లు అవసరమవుతాయని స్థానిక టీడీపీ నేతలే చెబుతున్నట్లు సమాచారం. దీంతో స్థానిక ఎన్నికల ముందు ఈ అంశం అధికార పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందన్న ఆందోళన పెరుగుతోంది.
ఇదే సమయంలో మహిళలకు నెలకు రూ.1,500 చెల్లిస్తామన్న హామీ అమలుపైనా, ఉచిత గ్యాస్ సిలండర్లపైన అసంతృప్తి వ్యక్తమవుతోందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు వికలాంగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, డయాలసిస్ రోగుల పెన్షన్ల విషయంలోనూ అర్హులకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ కలిస్తే స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి సంక్షేమమే ప్రధాన రాజకీయ సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
స్థానిక ఎన్నికల నాటికైనా కొత్త పెన్షన్లపై స్పష్టమైన ప్రకటన చేసి, ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆగ్రహాన్ని చల్లార్చాలని టీడీపీ స్థానిక నేతలు ప్రభుత్వ పెద్దలను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేవలం ఎన్నికల ముందు ప్రకటనతో సరిపెడతారా? లేక నిజంగానే కొత్త పెన్షన్ల మంజూరుకు శ్రీకారం చుడతారా? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఏదేమైనా.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త పెన్షన్ల వ్యవహారం కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఎంతటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.






