గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పీఎంఈజీపీ పథకం కింద రూ.10 లక్షల సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పొన్న యుగంధర్ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉందంటూ పవన్ కళ్యాణ్, నాగబాబు, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, టీడీపీ ఎమ్మెల్యే థామస్ తదితరుల ఫొటోలను చూపిస్తూ అమాయక కార్యకర్తలను నమ్మించారని ఆరోపణలు ఉన్నాయి. రూ.10 లక్షల రుణం ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2,100 చొప్పున వసూలు చేశారని, పార్టీ సభ్యత్వం లేని సామాన్యుల నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఆరు మండలాలకు చెందిన వందలాది మంది బాధితులు ఆయన మాటలు నమ్మి లక్షల రూపాయలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గొర్రెల కాపరుల నుంచి గ్రామీణ యువత వరకు పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వసూళ్ల వ్యవహారం తారస్థాయికి చేరడంతో విసిగిపోయిన ఆయా మండలాల జనసేన అధ్యక్షులు, స్థానిక నేతలే చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఫిర్యాదుల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్ విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే కేసు నమోదు చేసేలా ఎస్పీతో పాటు స్థానిక సీఐ, ఎస్‌ఐలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారం నియోజకవర్గంలోని జనసేనలో అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేసినట్లు సమాచారం. ఇప్పటికే రెండు వర్గాలుగా కనిపిస్తున్న పార్టీ నేతలు, ఇటీవల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సైతం వేర్వేరుగా నిర్వహించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని పార్టీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కొన్ని నియోజకవర్గాల్లో తరచూ తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. గంగాధర నెల్లూరు వ్యవహారంపై జనసేన అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఫిర్యాదులు రావడం పార్టీ నాయకత్వానికి మరింత ఇబ్బందికరంగా మారింది.






