మెగా డీఎస్సీ–2025లో (Mega DSC–2025) స్పోర్ట్స్ కోటా (Sports Quota) అక్రమాలపై మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. క్రీడల్లో పాల్గొనకపోయినా నకిలీ ఖోఖో పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో(Fake Kho-Kho Participation Certificates) కొందరు ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
చిత్తూరు జిల్లాకు చెందిన పీవీసీహెచ్ బసవేశ్వరరావు (PVCH Basaveswara Rao) 2015లో గుడివాడలో(Gudivada) జరిగిన 49వ ఏపీ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ సమర్పించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆ టోర్నీలో ప్రకాశం జిల్లా తరఫున పాల్గొన్న 12 మంది సభ్యుల జట్టు ఫొటోలో ఆయన పేరు, ఫొటో లేకపోవడంతో పాటు.. తాను ఆ పోటీల్లో పాల్గొనలేదని ఖోఖో సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి (Mekala Seetharamireddy) పేర్కొన్నట్లు సమాచారం.
ఇదే సమయంలో చిల్లా మోహినీదేవి(Chilla Mohinidevi), సీహెచ్ యోగేశ్వరరావు(CH Yogeswara Rao) సమర్పించిన క్రీడా ధ్రువపత్రాలపైనా ఏపీ ఖోఖో సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. సంబంధిత టోర్నమెంట్ అధికారిక రికార్డుల్లో వారి పేర్లు లేవని, వారి సర్టిఫికెట్ల ధ్రువీకరణ కోసం శాప్ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని సంఘం స్పష్టం చేసింది.
స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లపై ముందుగానే అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కొందరికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సర్టిఫికెట్లు నకిలీవని విచారణలో తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఖోఖో సంఘం కోరింది. దీంతో మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.







