భారత పారా ఆర్చర్(Para Archer), ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి (Sheetal Devi) మరోసారి సత్తా చాటుకుంది. అహ్మదాబాద్‌లో(Ahmedabad) జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో(World Archery Para Series) మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో(Women’s Compound Individual) స్వర్ణ పతకం(Gold Medal) సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో తన కెరీర్‌లో తొలి వ్యక్తిగత టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజాదా సీదాన్‌తో(Aizada Seidan) శీతల్ హోరాహోరీగా తలపడింది. ఇద్దరూ 144-144తో సమంగా నిలవడంతో షూట్‌ఆఫ్ నిర్వహించారు. ఇందులో శీతల్ 10 పాయింట్లు సాధించగా, సీదాన్ 9 పాయింట్లకే పరిమితమైంది. దీంతో శీతల్ 10-9 తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.
అంతకుముందు అర్హత పోటీల్లో శీతల్ సీజన్‌లోనే అత్యుత్తమంగా 698 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఐచి-నగోయా 2026 ఆసియా పారా గేమ్స్‌కు ముందు ఈ విజయం ఆమెకు మంచి ఉత్సాహాన్నిచ్చింది. గత హాంగ్‌జౌ ఆసియా పారా గేమ్స్‌లో(Hangzhou Asian Para Games) వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో టైటిల్స్ సాధించిన శీతల్.. మరోసారి ఆధిపత్యం చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదే టోర్నీలో తోమన్ కుమార్‌తో(Thoman Kumar) కలిసి మిక్స్‌డ్ టీమ్ విభాగంలో శీతల్ కాంస్య పతకం కూడా సాధించింది. భారత జోడీ 157-145తో ఇరాక్ జోడీని ఓడించింది. దీంతో ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటివరకు 15 పతకాలు సాధించింది. ఇందులో 4 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి.
శీతల్ దేవి ఇప్పటికే పారా ఆర్చరీలో ఎన్నో ఘనతలు సాధించింది. 2025 ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి చేతులు లేని మహిళగా చరిత్ర సృష్టించింది. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం, 2 ఆసియా పారా గేమ్స్ టైటిల్స్ సాధించింది. 2024 పారిస్ పారాలింపిక్స్‌లో 17 ఏళ్ల వయసులో మిక్స్‌డ్ టీమ్ కాంస్యం గెలిచి, దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన పారాలింపిక్ పతక విజేతగా నిలిచింది.







