డీఎస్సీ నియామకాల్లో (DSC Recruitments) అక్రమాలు, స్పోర్ట్స్ కోటాలో(Sports Quota) నకిలీ సర్టిఫికెట్లు(Fake Certificates), టెట్ అర్హత (TET Eligibility) లేని అభ్యర్థులకు ఉద్యోగాలు, వెరిఫికేషన్ ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్సీ వ్యవహారంపై పలు కీలక అంశాలను వెల్లడించారు. ఈ స్కామ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో(CBI) విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. టెట్ అర్హత లేకుండానే కొందరికి పోస్టులు కట్టబెట్టారని, జూడో సహా పలు క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్లపై అనుమానాలు ఉన్నప్పటికీ నియామకాలు చేపట్టారని ఆరోపించారు. ఏడుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ (Certificate Verification) చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆ ప్రక్రియే బోగస్‌గా కనిపిస్తోందని విమర్శించారు. అసలు పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇవ్వడం డీఎస్సీ వ్యవహారంలోనే అతిపెద్ద అక్రమమని అన్నారు.
విశాఖపట్నంకు (Visakhapatnam) చెందిన యోగేశ్వరరావుకు (Yogeshwara Rao) ఎలాంటి పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఎస్‌జీటీ ఉద్యోగం (SGT Job) ఇచ్చారని జగన్ ఆరోపించారు. ఆయన సోదరికి కూడా ఉద్యోగం రావడాన్ని ప్రస్తావిస్తూ ‘ఫ్యామిలీ ప్యాకేజీ’లా (Family Package) పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. యోగేశ్వరరావు(Yogeshwara Rao), మోహినీదేవి (Mohini Devi) పేర్లు తాము నిర్వహించిన ఈవెంట్‌లో లేవని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ప్రగడ కల్యాణి, ఈడిగ ప్రభాకర్ వ్యవహారాలను కూడా ప్రస్తావిస్తూ.. అర్హతలు, సర్టిఫికెట్లపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.
జూడో(Judo), సాఫ్ట్‌బాల్ (Softball) విభాగాల్లోనూ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం జరిగిందని జగన్ ఆరోపించారు. సంబంధిత క్రీడా సంఘాల బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తుల రాజకీయ సంబంధాలను ప్రస్తావిస్తూ.. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కు జరిగిందనే అనుమానాలకు ఈ వ్యవహారాలు బలం చేకూరుస్తున్నాయని అన్నారు.
ఏపీపీఎస్సీలోనూ (APPSC) పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నించారని జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో క్లియరెన్స్ పొందిన 814 పోస్టుల్లో 40 పోస్టులను పరీక్ష లేకుండా భర్తీ చేసేందుకు జీవో నంబర్ 4 ద్వారా దొడ్డిదారి ప్రయత్నం జరిగిందని, డీఎస్సీ వ్యవహారం వెలుగులోకి రావడంతో అది ఆగిపోయిందని పేర్కొన్నారు.
డీఎస్సీ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు(Chandrababu), లోకేశ్‌లు (Lokesh) వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తున్నారని విమర్శిస్తూ.. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు కోర్టులోనూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
‘కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు’ అంటూ డీఎస్సీ వివాదంపై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపైనా జగన్ స్పందించారు. డీఎస్సీపై వస్తున్న ప్రశ్నలకు చంద్రబాబు, లోకేశ్ ఇచ్చే సమాధానాలు కూడా వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నంగానే ఉన్నాయని విమర్శించారు.
డీఎస్సీ వ్యవహారంపై బీజేపీ(BJP), జనసేన(Jana Sena) మౌనంగా ఉండటాన్ని కూడా జగన్ ప్రశ్నించారు. తాను లేవనెత్తిన అంశాలు సరైనవేనని భావిస్తే అన్ని రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న బీజేపీ, జనసేన నేతలే దీనిపై సమాధానం చెప్పాలని సూచించారు.
చంద్రబాబు రాజకీయ జీవితంలోని కుంభకోణాల చరిత్రలో డీఎస్సీ వ్యవహారం ఒక ‘ఆణిముత్యం’ అంటూ జగన్ ఎద్దేవా చేశారు. వ్యవస్థలు బలహీనపడినప్పుడు ప్రజల్లో అసంతృప్తి పెరిగి కొత్త ఉద్యమాలు పుట్టుకొస్తాయని, ఇలాంటి స్కామ్‌లు కొనసాగితే ‘కాక్రోచ్‌లు’(Cockroaches) పుట్టుకురావడం సహజమేనని వ్యాఖ్యానించారు. డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమగ్ర సమాధానం ఇవ్వడంతో పాటు, స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.





