ఉత్తర బంగాళాఖాతంలో(North Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం (Low Pressure Area) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) వెల్లడించింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు (Gusty Winds) వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు అప్రమత్తంగా ఉండటంతో పాటు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని సూచించారు.
మరోవైపు రాష్ట్రంలో గత 2, 3 రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం విజయవాడతో(Vijayawada) పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
శ్రీకాకుళం జిల్లాలో గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.





