---Advertisement---

హ్యుందాయ్ షిప్‌యార్డ్‌పై టీడీపీ ప్రచారానికి బ్రేక్?.. తూత్తుకుడిలోనే సంస్థ ఫోకస్!

September 11, 2026

Summarize with AI

---Advertisement---

దక్షిణ కొరియాకు (South Korea) చెందిన ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ హెచ్‌డీ హ్యుందాయ్ (HD Hyundai) ప్రతిపాదించిన రూ.34,000 కోట్ల మెగా గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ప్రాజెక్ట్(Mega Greenfield Shipyard) ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) తరలివస్తోందంటూ ఇటీవల తెలుగుదేశం (Telugu Desam) అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఏర్పాటు కావాల్సిన ఈ ప్రాజెక్ట్‌ను మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చొరవతో కాకినాడ సెజ్‌కు తీసుకొస్తున్నారని అనుకూల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఈ ప్రచారంలో నిజం లేదని తెల్చేసాయి.

హెచ్‌డీ హ్యుందాయ్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సెప్టెంబరు 1 నుంచి 10 వరకు తమిళనాడులో(Tamil Nadu) పర్యటించి తూత్తుకుడిలోని ప్రతిపాదిత ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించింది. సన్జూన్ హాంగ్ (Sanjeon Hong) నేతృత్వంలోని కొరియన్ బృందం తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమావేశమై ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించింది. తూత్తుకుడిలోనే షిప్‌యార్డ్(Shipyard) ఏర్పాటుకు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సాంకేతిక ప్రక్రియలు కూడా ముందుకు సాగుతున్నాయి. వీవోసీ పోర్ట్ అథారిటీ (VOC Port Authority) ద్వారా డిటైల్డ్ ఫిజిబిలిటీ రిపోర్ట్‌కు వర్క్ ఆర్డర్ జారీ కాగా, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్లను ఎంపిక చేసేందుకు ఆర్‌ఎఫ్‌పీ కూడా పిలిచారు. తొలి దశలో సుమారు 1,700 ఎకరాల భూమిని సిప్‌కాట్‌కు బదిలీ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాకుండా, కొరియన్ ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమై ప్రాజెక్టుకు అవసరమైన విధానపరమైన మద్దతుపై చర్చించారు. తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర పోర్ట్స్ మంత్రిత్వ శాఖ, హెచ్‌డీ హ్యుందాయ్ మధ్య 2026 ఏప్రిల్ 20న కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం తూత్తుకుడిలో 2.5 మిలియన్ గ్రాస్ టన్నుల సామర్థ్యంతో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా, 2026 జూలైలో దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా మంత్రి నారా లోకేష్(Nara Lokesh) హెచ్‌డీ హ్యుందాయ్ యాజమాన్యంతో సమావేశమై కాకినాడ గేట్‌వే పోర్ట్ వసతులు, ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’(Speed of Doing Business) విధానాలను వివరించినట్లు టీడీపీ(TDP) మీడియాలో ప్రచారం జరిగింది. ఈ భేటీ ఆధారంగా హ్యుందాయ్ తూత్తుకుడి ఒప్పందాన్ని రద్దు చేసుకుని కాకినాడ సెజ్‌కు వస్తోందంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే, ఆ తర్వాత హ్యుందాయ్ ప్రతినిధులు తూత్తుకుడిలోనే ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టడంతో ఇప్పుడు టీడీపీ ప్రచారంలో వాస్తవం లేదని తేలిందనే చర్చ మొదలైంది.

హ్యుందాయ్ వ్యవహారంతో పాటు, ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్నాయన్న ప్రభుత్వ ప్రచారం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పారిశ్రామిక పరిణామాల మధ్య వ్యత్యాసంపై కూడా మరోసారి చర్చ సాగుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.3,538 కోట్ల పెట్టుబడితో 8 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ తయారీ ప్రాజెక్ట్ (Solar Manufacturing Project) ఏర్పాటు చేయాల్సిన వెబ్‌సోల్ సంస్థ పశ్చిమ బెంగాల్‌కు వెళ్లనున్నట్లు ప్రకటించింది. తక్కువ భూమి ఖర్చులు, మెరుగైన పారిశ్రామిక వాతావరణం వంటి కారణాలను సంస్థ ప్రస్తావించింది.

అదేవిధంగా టాటా పవర్ (Tata Power) రూ.6,675 కోట్ల విలువైన 10 గిగావాట్ల తయారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ అనకాపల్లిలో ప్రతిపాదించిన రూ.1,200 కోట్ల ప్లాంట్‌ను విరమించుకుని తెలంగాణకు తరలించినట్లు, ఆజాద్ ఇండియా మొబిలిటీ రూ.1,046 కోట్ల ప్రాజెక్ట్‌ను రద్దు చేసినట్లు, జ్యూపిటర్ రిన్యూవబుల్ ఎనర్జీ రూ.2,700 కోట్ల పెట్టుబడిని వెనక్కి తీసుకున్నట్లు కూడా చర్చ జరుగుతోంది.

దీనికి తోడు, నీతి ఆయోగ్‌కు (NITI Aayog) చెందిన ‘ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్‌లీనెస్ ఇండెక్స్’లో(Investment Friendliness Index) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 8వ స్థానానికి పడిపోయిందన్న అంశం కూడా పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో రాష్ట్రానికి వస్తున్నాయని ప్రకటిస్తున్న పెట్టుబడులు, మీడియాలో జరుగుతున్న ప్రచారం, వాస్తవంగా ప్రారంభమవుతున్న పరిశ్రమల మధ్య వ్యత్యాసం ఆందోళణ స్థాయిలో ఉందన్న చర్చ జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఏపీకి ప్రాజెక్టులు వస్తున్నాయన్న ప్రచారానికి, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పారిశ్రామిక వాస్తవాలకు మధ్య పొంతన లేకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment