తిరుపతి (Tirupati) నుంచి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్)(NIELIT)ను అమరావతికి(Amaravati) తరలించడాన్ని నిరసిస్తూ జెన్ జీ (Gen Z) ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు(Students), యువత(Youth), నగర ప్రజలు పాల్గొన్న ఈ నిరసనకు ‘కాక్రోచ్ తిరుపతి’ (Cockroach Tirupati) అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ రెండో గేట్ నుంచి మెయిన్ గేట్ వరకు జరిగిన ర్యాలీలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి(Maddila Gurumoorthy), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్‌చార్జ్ భూమన అభినయ్ రెడ్డి(Bhumana Abhinay Reddy), ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం(Sipaai Subramanyam), మాజీ మేయర్ డాక్టర్ శిరీష(Dr. Sirisha), మాజీ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి (Yandavalli Srinivasulu Reddy) తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ.. నైలెట్‌ను తిరుపతిలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) హయాంలో రూపుదిద్దుకుందని తెలిపారు. 4 వేల నుంచి 12 వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించి, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో వారిని తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. తిరుపతిలో సుమారు 15 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి డీపీఆర్ (DPR) సిద్ధమైన పరిస్థితుల్లో నైలెట్‌ను అమరావతికి తరలించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
తిరుపతికి ప్రతిపాదించిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(National Forensic Sciences University), స్కిల్ యూనివర్సిటీ (Skill University) వంటి సంస్థల విషయంలోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొందని గురుమూర్తి అన్నారు. అమరావతికి కొత్త విశ్వవిద్యాలయాలు, సంస్థలు రావడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే రాయలసీమకు ప్రతిపాదించిన విద్యా, నైపుణ్య సంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించడంపైనే తమ అభ్యంతరమని స్పష్టం చేశారు.
రాయలసీమ యువతకు స్థానికంగానే మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైలెట్ వంటి నైపుణ్య సంస్థలు ఎంతో కీలకమని ఆయన అన్నారు. తిరుపతి ప్రాంతంలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు తగిన నైపుణ్య శిక్షణ అందిస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. రాయలసీమలో విద్య, ఉపాధిపై ఆధారపడుతున్న యువతకు మరిన్ని ఉన్నత విద్య, నైపుణ్య సంస్థలు అవసరమని తెలిపారు.
తిరుపతికి ప్రతిపాదించిన నైలెట్‌తో పాటు ఇతర విశ్వవిద్యాలయాలు, సంస్థలను కూడా తిరుపతిలోనే ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) తరఫున డిమాండ్ చేస్తున్నామని ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. రాయలసీమ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నైలెట్ తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు.





