తిరుపతిలో (Tirupati) పారామెడికల్ విద్యార్థులు (Paramedical Students) తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన శాంతియుత నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఎఫ్ఐ (SFI) ఆధ్వర్యంలో రూయా ఆస్పత్రి(Ruia Hospital) నుంచి అలిపిరి (Alipiri) వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విద్యార్థి సంఘాలు, విపక్ష పార్టీలు ఆరోపించాయి. ముఖ్యంగా విద్యార్థినుల (Female Students) పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించి, అరెస్టులు చేశారని వారు తీవ్రంగా తప్పుబట్టారు.
నాలుగేళ్లలో పూర్తికావాల్సిన పారామెడికల్ కోర్సు 2021లో చేరిన విద్యార్థులకు 2026 వచ్చినా పూర్తికాకపోవడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకడమిక్ సంవత్సరాల ఆలస్యంతో ఇప్పటికే విలువైన సమయం కోల్పోయామని, ఇప్పుడు మరో ఏడాది ఇంటర్న్షిప్ (Internship) చేయాలని చెప్పడం తమపై అదనపు భారాన్ని మోపడమేనని పేర్కొన్నారు.
ఆస్పత్రుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ల్యాబ్స్, ఎమర్జెన్సీ వార్డులు, ఇతర విభాగాల్లో సేవలు అందిస్తున్నప్పటికీ తమకు ఎలాంటి స్టైఫండ్ (Stipend) ఇవ్వడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు కనీసం రూ.15 వేల స్టైఫండ్, ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రభుత్వ హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
పారామెడికల్ విద్యార్థుల ఆందోళన ఐదో రోజుకు చేరినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమని విపక్షాలు విమర్శించాయి. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పోలీసుల ద్వారా విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయాలని చూడటం నిరంకుశ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తాయి. విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలపై ప్రభుత్వం స్పందించి, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశాయి.





