---Advertisement---

ఆళ్ల నాని ఆకస్మిక మృతి.. కాంగ్రెస్‌ నుంచి వైఎస్సార్‌సీపీ, టీడీపీ వరకు సాగిన రాజకీయ ప్రస్థానానికి ముగింపు.

September 15, 2026

Summarize with AI

---Advertisement---

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (Alla Kali Krishna Srinivas) (ఆళ్ల నాని) (Alla Nani) గుండెపోటుతో (Heart Attack) మృతి చెందారు. 56 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడంతో ఏలూరు రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీతో(Congress Party రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆళ్ల నాని.. అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో (YSRCP) చేరి కీలక నేతగా ఎదిగారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

1969 డిసెంబర్‌ 30న ఏలూరులో ఆళ్ల సూర్యచంద్రరావు(Alla Suryachandra Rao), నాగమణి (Nagamani) దంపతులకు జన్మించిన ఆళ్ల నాని.. ఏలూరులోని కేపీ హైస్కూల్‌లో 1985లో పదో తరగతి, సర్‌ సీఆర్‌ఆర్‌ కళాశాలలో 1988లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీకాం చదువుతూ మధ్యలోనే విద్యాభ్యాసాన్ని నిలిపివేశారు.

1994లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. 1999లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లోనూ ఏలూరు నుంచి గెలుపొందారు. 2013లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

2014 ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ వైఎస్సార్‌సీపీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమించడంతో పాటు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అనంతరం పార్టీ వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించారు.

2019 ఎన్నికల్లో ఏలూరు (Eluru) నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. మంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా పార్టీ అధ్యక్ష హోదాలో కీలకంగా వ్యవహరించారు.

2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి తర్వాత ఆళ్ల నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తొలుత పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్లు వైఎస్‌ జగన్‌కు లేఖ రాశారు. అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2025 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీలో(TDP) చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబు (Chandrababu Naidu) సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.

అయితే టీడీపీలో చేరిన తర్వాత రాజకీయంగా ఆయనకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదనే అభిప్రాయం ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆళ్ల నాని ఆకస్మిక మృతి ఏలూరు రాజకీయ వర్గాల్లో ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, చివరి దశలో చోటుచేసుకున్న పరిణామాలపై మరోసారి చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment