---Advertisement---

డీఎస్సీ అక్రమాలపై సమరశంఖం.. 21న శాప్‌ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ భారీ నిరసన

September 15, 2026

Summarize with AI

---Advertisement---

డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై వైఎస్సార్సీపీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోంది. ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ప్రకటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

16 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని అంబటి రాంబాబు విమర్శించారు. స్పోర్ట్స్‌ కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచడం ద్వారా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేసి, అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారంటూ ఆరోపించారు. డీఎస్సీ నియామకాల్లో పేపర్‌ లీక్‌ కూడా జరిగిందని ఆయన విమర్శించారు.

ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల్లో సైతం తమకు ఉద్యోగం ఎలా వచ్చిందో స్పష్టత లేని పరిస్థితి నెలకొందని అంబటి పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ గురించి ఆలోచించే ముందు, ప్రస్తుత డీఎస్సీ నియామకాల్లో వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని స్పష్టం చేశారు.

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందని అంబటి ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధ్యతను అధికారులపైకి నెట్టి వారిని బలిపశువులను చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొన్న వారికే ఉద్యోగాలు కట్టబెట్టారా అని ప్రశ్నిస్తూ, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు. ఇదే వ్యవహారంలో ఎస్సీ లేదా బీసీ వర్గానికి చెందిన మరో మంత్రి ఉంటే ఇప్పటికే రాజీనామా చేయించి ఉండేవారని వ్యాఖ్యానించారు. డీఎస్సీ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం భయపడుతోందని, ప్రశ్నించే వారి సోషల్‌ మీడియా వీడియోలను తొలగించడం, ప్రసారం చేసే టీవీ ఛానళ్లను అడ్డుకోవడం ద్వారా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

పోలీసులను అడ్డుపెట్టుకుని నిరుద్యోగులు, బాధితుల ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాలపై న్యాయ విచారణ జరిపించి, బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment