---Advertisement---

డీఎస్సీ తర్వాత మరో నియామకంపై ఆరోపణలు?.. 24 గంటల్లోనే నిర్ణయాలు ఎందుకు మారాయి?

September 15, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదన్న విమర్శలు కొనసాగుతున్న వేళ.. మరో ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకున్న వరుస నిర్ణయాలు అనుమానాలకు తావిస్తున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

మొదట ఏపీపీఎస్సీ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జీవో 21 జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం తీసుకున్న 24 గంటలు గడవకముందే ప్రభుత్వం మరో నిర్ణయానికి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పరీక్షా విధానాన్ని పక్కనపెట్టి మెరిట్‌ ఆధారంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది.

సాధారణంగా ఈ పోస్టుల నియామక ప్రక్రియలో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీతో పాటు వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ స్థాయి ప్రశ్నలతో పరీక్ష నిర్వహించే విధానం ఉంటుంది. అయితే తాజాగా పరీక్ష లేకుండా కేవలం మెరిట్‌ ఆధారంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంపై నిరుద్యోగులు, ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదే సమయంలో ఏపీపీఎస్సీకి అప్పగించిన నియామక బాధ్యతలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం మరింత అనుమానాలకు కారణమవుతోంది. జీవో 22 ద్వారా నియామక ప్రక్రియను ఉపసంహరించుకుని, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలోని సెలక్షన్‌ కమిటీకి నియామక బాధ్యతలు అప్పగించింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే నిర్ణయాలు, జీవోలు మారడం వెనుక అసలు కారణమేంటని వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది.

అంతేకాకుండా పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా వివాదాస్పద అధికారి దామోదర్‌ కొనసాగింపుపైనా ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది. ఆయనకు టీడీపీ అనుకూల అధికారిగా ముద్ర ఉందని ఆరోపిస్తున్న వైఎస్సార్‌సీపీ.. అలాంటి అధికారికి నియామక ప్రక్రియను అప్పగించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తోంది.

పరీక్ష నిర్వహించకుండా మెరిట్‌ పేరుతో నియామకాలు చేపట్టడం, ఏపీపీఎస్సీ నుంచి బాధ్యతలను వెనక్కి తీసుకోవడం, వెంటనే మరో సెలక్షన్‌ కమిటీకి ప్రక్రియను అప్పగించడం వంటి పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే నియామకాల్లో పారదర్శకతపై సందేహాలు తలెత్తుతున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. పరీక్ష లేకుండా తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment