యూనిఫాం సివిల్ కోడ్ పై (Uniform Civil Code – UCC) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన ప్రకటన నేపథ్యంలో ఎన్డీయే కూటమిలోనే(NDA Alliance) భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికలకు (2029 Lok Sabha Elections) ముందే ఎన్డీయే పాలిత 21 రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామని అమిత్ షా ప్రకటించగా.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్డీయే భాగస్వామిగా అమిత్ షా (Amit Shah) ప్రకటించిన వైఖరికి టీడీపీ(TDP) కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
యూసీసీపై గతంలో టీడీపీ తీసుకున్న వైఖరితో పోలిస్తే తాజా ప్రకటన భిన్నంగా కనిపిస్తోందన్న చర్చ మొదలైంది. 2023 జూలైలో యూసీసీపై(UCC) దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముస్లిం మత పెద్దలు(Muslim Religious Leaders), మైనారిటీ వర్గాల ప్రతినిధులతో (Minority Community Representatives) సమావేశమయ్యారు. యూసీసీ ముసాయిదాను పూర్తిగా పరిశీలించి, ముస్లిం సమాజం వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని, వారి ప్రయోజనాలు లేదా మతపరమైన మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోబోమని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు.
అయితే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు.. టీడీపీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నందున కేంద్ర హోంమంత్రి ప్రకటించిన యూసీసీ విధానానికి కట్టుబడి ఉంటామని చెప్పడంతో ముస్లిం సమాజంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో తమకు ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం కూటమి భాగస్వామిగా టీడీపీ తీసుకుంటున్న వైఖరికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోందని కొందరు ముస్లిం వర్గాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ రాజకీయ వైఖరిలో వచ్చిన మార్పులపై కూడా ఈ సందర్భంగా చర్చ జరుగుతోంది. గతంలో బీజేపీతో(BJP) పొత్తుపై టీడీపీ చేసిన విమర్శలు, మైనారిటీలకు ఇచ్చిన హామీల నేపథ్యంలో.. ఇప్పుడు అదే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతూ యూసీసీపై కేంద్రం ప్రకటించిన విధానానికి మద్దతు ఇవ్వడం ప్రశ్నలకు తావిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఎన్డీయేలోని మరో కీలక భాగస్వామి జేడీయూ మాత్రం యూసీసీపై తొందరపాటు నిర్ణయం అవసరం లేదని స్పష్టం చేసింది. బిహార్ (Bihar) ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ చౌదరి(Vijay Kumar Chaudhary) … ప్రతిపాదిత చట్టాన్ని ముందుగా అధ్యయనం చేసి, అందులోని నిబంధనలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బిహార్‌లోని ఎన్డీయే భాగస్వాములతో కూడా ఈ అంశంపై చర్చిస్తామని జేడీయూ వెల్లడించింది.
దీంతో యూసీసీ విషయంలో ఎన్డీయే కూటమిలోని పార్టీల వైఖరులు ఒకేలా లేవన్న విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఏపీలో టీడీపీ మద్దతు విషయంలో మాత్రం గతంలో మైనారిటీలకు ఇచ్చిన హామీలను పలువురు తెరపైకి తెస్తూ, మరోసారి టీడీపీ తన రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తోందనే విమర్శలు వారి నుంచి వ్యక్తమవుతున్నాయి.





