ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యావరణ ప్రాధాన్యం కలిగిన కొండల్లో(Hills) అక్రమ తవ్వకాలు (Illegal Mining) జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కాకినాడ జిల్లాలోని కొడవలి బౌద్ధ క్షేత్రం పరిధిలోని తురుక్కుల కొండ, అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండ, రామకొండ, అల్లూరి సీతారామరాజు చారిత్రక గుహలు ఉన్న గంగాలమ్మ కొండతో పాటు పలు ప్రాంతాల్లో భారీ యంత్రాలతో గ్రావెల్(Gravel), మట్టి(Soil), లేటరైట్ (Laterite) తవ్వకాలు సాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు, రక్షిత ప్రాంతాల పరిమితులు, ప్రభుత్వం ప్రకటించిన ‘నో మైనింగ్ జోన్’(No Mining Zone) వంటి అంశాలను ఉల్లంఘించి తవ్వకాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొడవలి బౌద్ధ క్షేత్రం (Kodavali Buddhist site) క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటిదిగా పేర్కొంటున్న నేపథ్యంలో, తురుక్కుల కొండలో భారీగా తవ్వకాలు జరగడం వల్ల అక్కడి ప్రాచీన బౌద్ధ నిర్మాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పంచదార్ల కొండను ప్రభుత్వం ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించిన తర్వాత కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
అల్లూరి సీతారామరాజు ఉద్యమంతో (Alluri Sitarama Raju movement) ముడిపడిన గంగాలమ్మ కొండ (Gangalamamma Hill) ప్రాంతంలోనూ భారీ స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నాయని, చారిత్రక గుహలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చోడవరం, నక్కపల్లి తదితర ప్రాంతాల్లోనూ కొండలను గ్రావెల్, మట్టి కోసం తవ్వుతున్నారని స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
అక్రమ తవ్వకాల వెనుక అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని, మైనింగ్ వ్యవహారాల్లో అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్నాయి. చారిత్రక వారసత్వం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఈ వ్యవహారాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్రమార్కులకు బాటలు వేసేలా వ్యవహరిస్తుండటంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.





