ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) గారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (Coalition Government) సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. అయితే, చాగంటి గారు గతంలో అధికార హోదాలో వినాయక చవితి నిమజ్జనంలో శబ్ద కాలుష్యంపై చేసిన సూచనలను ప్రభుత్వంలో కీలకంగా ఉన్న లోకేష్(Nara Lokesh) తాజాగా ఇప్పుడు పక్కన పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వినాయక చవితి నిమజ్జనంలో శబ్ద కాలుష్యంపై (Noise Pollution) చాగంటి గారు అధికార హోదాలో చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. వినాయక చవితి ఉత్సవాల (Vinayaka Chavithi Celebrations) సందర్భంగా, ముఖ్యంగా నిమజ్జనోత్సవాల్లో విపరీతంగా పెరిగిపోతున్న డీజేల శబ్ద కాలుష్యంపై చాగంటి కోటేశ్వరరావు గారు ఎంతో వినమ్రంగా, సోదర భావంతో విజ్ఞప్తి చేశారు. ఊరేగింపుల్లో డీజేలు పెట్టి విపరీతమైన శబ్దాలు చేయడం వల్ల చుట్టుపక్కల నివాసాల్లో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అంత ఖర్చు పెట్టి భక్తితో నిర్వహించే ఉత్సవాలు నిమజ్జనం సమయానికి కట్టుతప్పకూడదని, సంప్రదాయ మంగళ వాద్యాలు, భజనలు, కీర్తనలతో ప్రశాంతంగా, పోలీసులకు సహకరిస్తూ జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్సవాల వేళ డీజేల శబ్దాల వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, శబ్ద కాలుష్యంపై పూర్తి స్థాయి ఆంక్షలు విధించాలని సాధారణ ప్రజల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయని ఆయన తన సందేశాన్ని వీడియో రూపంలో వెల్లడించారు.
ఈ నేపథ్యంలో తాజాగా గణేష్ నిమజ్జనం వేళ టీడీపీ(TDP) కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు నిరాకరిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్(Nara Lokesh) స్పందిస్తూ హోంమంత్రి అనిత గారికి, డీజీపీ గారికి సోషల్ మీడియా ద్వారా సందేశం పంపారు. డీజే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుమతులు మంజూరు చేయాలని, ఏ ఒక్క డీజే వాహనాన్ని కూడా సీజ్ చేయకూడదని లోకేష్ కోరారు.
ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం స్వయంగా కేబినెట్ ర్యాంక్ హోదాతో నైతిక విలువల సలహాదారుగా నియమించిన చాగంటి కోటేశ్వరరావు గారు గతంలో అధికార హోదాలో పండుగ ఆధ్యాత్మికత, ప్రజల ఆరోగ్యం, శబ్ద కాలుష్య నివారణ కోసం ఇచ్చిన సలహాలను పక్కనబెట్టి డీజేలకు అనుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. చాగంటి గారికి లోకేష్ ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.
డీజేల భారీ శబ్దాల వల్ల రోగులు, వృద్ధులు, పసిపిల్లలు, సాధారణ భక్తులు ఎదుర్కొనే తీవ్ర అసౌకర్యాన్ని విస్మరించి, కేవలం కార్యకర్తలు, ఉత్సవ నిర్వాహకుల ఆనందం కోసమే లోకేష్ ప్రాధాన్యత ఇచ్చారా? అని పలువురు నెటిజన్లు నిలదీస్తున్నారు.
పోలీసులు ప్రాథమికంగా శబ్ద కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఆంక్షలు విధించాలని భావించినప్పటికీ, రాజకీయ జోక్యంతో చాగంటి గారి సూచనలకు, పోలీసుల నిబంధనలకు గౌరవం లేకుండా పోయిందనే అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్నాయి.





