మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఫోన్ ద్వారా ఆయనకు సమాచారం అందించామని, అంబటి రాంబాబు నేరుగా ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈడీ విచారణ నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై చర్చ జరుగుతోంది.
మరోవైపు, తనపై కుట్ర జరుగుతోందని అంబటి రాంబాబు ఆరోపించారు. కేంద్రమంత్రి పెమ్మసాని తనను లిక్కర్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, అసలు ఆ కేసుతో తనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, కేసులు, బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్‌ను టీడీపీ సోషల్ మీడియాలో అవమానకరంగా చూపిస్తున్నారని ఆరోపించారు. తమ నాయకులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దారుణంగా చిత్రీకరిస్తున్నారని, తాము సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేస్తే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నించే పోస్టులను ఎఫ్‌బీఐ పేరుతో తొలగిస్తున్నారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.





