వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆమెను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
భీమిలి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, ప్రజా సమస్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడం వంటి కీలక బాధ్యతలను బొత్స అనూష నిర్వహించనున్నారు.
ఇటీవల భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మజ్జి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో.. ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారనే చర్చకు తాజాగా తెరపడింది. బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషకు భీమిలి బాధ్యతలు అప్పగించడంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
2029 అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బొత్స సత్యనారాయణ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆయన కుమార్తెకు భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నియామకంతో భీమిలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు మరింత ఊపు వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.






