టాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్ (Shruti Haasan) మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల నటి సోహా అలీ ఖాన్‌తో (Soha Ali Khan) కలిసి పాల్గొన్న ఓ టాక్ షోలో పీరియడ్స్, నెలసరి నొప్పి, హార్మోన్ల మార్పుల గురించి ఆమె మాట్లాడారు.
మహిళలు (Women) ఎదుర్కొనే పీరియడ్ నొప్పి(Period Pain), అసౌకర్యాన్ని(Discomfort) మగవాళ్లు (Men) కూడా ఒకసారి అనుభవిస్తే ఆ బాధ వారికి అర్థమవుతుందని శ్రుతి అన్నారు. మగవాళ్లకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావాలని తాను దేవుడిని కోరుకుంటుంటానని సరదాగా వ్యాఖ్యానించారు. అలా జరిగితే షూటింగ్ ఒప్పందాల్లో(Shooting Contracts) పీరియడ్స్ సెలవులకు కూడా ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు.
శ్రుతి వ్యాఖ్యలపై సోహా అలీ ఖాన్ కూడా సరదాగా స్పందించారు. మగవాళ్లకు పీరియడ్స్ వస్తే రక్తస్రావం, టాంపాన్ పరిమాణం వంటి విషయాల్లో కూడా పోటీ పడే అవకాశం ఉందంటూ చమత్కరించారు. దీంతో వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన కెరీర్ ప్రారంభ రోజుల్లో పీరియడ్ క్రాంప్స్(Period Cramps) గురించి షూటింగ్ సెట్లలో మాట్లాడటానికి భయపడేదాన్నని శ్రుతి గుర్తుచేసుకున్నారు. ఒకసారి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ తన పరిస్థితిని ఎవరూ పట్టించుకోలేదని, అయితే కుమార్తె ఉన్న ఓ దర్శకుడికి విషయం చెప్పడంతో ఆయన అర్థం చేసుకుని షూటింగ్‌ను అనుకూలంగా మార్చారని తెలిపారు. మహిళలు పీరియడ్స్ గురించి మరింత బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
సినిమాల విషయానికి వస్తే శ్రుతి హాసన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల రజనీకాంత్‌తో కలిసి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ సినిమాలో నటించారు. అలాగే రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. విజయ్ సేతుపతి హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ట్రైన్’తో పాటు దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ తెలుగు ప్రాజెక్ట్‌లోనూ నటిస్తున్నట్లు సమాచారం.







