ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) రానున్న 2 నుంచి 3 రోజుల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ (Weather Department) హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వర్ష ప్రభావం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులే దీనికి ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు.
ఉత్తర అండమాన్ సముద్రంలో రానున్న కొన్ని గంటల్లో అల్పపీడనం (Low Pressure Area) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Weather Department) అంచనా వేసింది. అనంతరం ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతూ పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ నెల 23 లేదా 24వ తేదీ నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆ తర్వాత వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా లేదా తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వ్యవస్థ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు కూడా వ్యవసాయ పనులు చేపట్టే సమయంలో వాతావరణ పరిస్థితులను గమనించి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.





