డీఎస్సీలో అక్రమాలు (DSC Irregularities) జరిగాయని, నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో(Fake Sports Certificates) దొడ్డిదారిలో టీచర్ ఉద్యోగాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయని వైఎస్సార్సీపీ నేతలు(YSRCP Leaders), డీఎస్సీ బాధితులు(DSC Victims) పేర్కొంటున్నారు. అలాగే నకిలీ కుల ధ్రువపత్రాలు సృష్టించి దొడ్డిదారిలో టీచర్ పోస్టులు పొందారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా అనేక అక్రమాలు కళ్లముందు కనిపిస్తున్నా కనీసం సీబీఐ విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని డీఎస్సీ బాధితులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డీఎస్సీ బాధితులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చారు.
అయితే డీఎస్సీ బాధితులు, వైఎస్సార్సీపీ శ్రేణులు నిర్వహిస్తున్న ధర్నాతో బండారం బయటపడుతుందనే ఆందోళనతో నారా లోకేష్‌కు చెందిన యువగళం టీం సభ్యులు గురువుల ముసుగులో నిరసనకారులపై తీవ్రంగా దాడులకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. పోలీసుల చేతిలో ఉండాల్సిన లాఠీలతో యువగళం టీం సభ్యులు లోకేష్(Lokesh) డైరెక్షన్లో విచక్షణారహితంగా దాడులకు దిగారని వారు విమర్శించారు.
నిరసనలో వికలాంగులు ఉన్నారనే కనీస స్పృహ కూడా లేకుండా ఉన్మాదుల్లా రెచ్చిపోయి వారిపైనా దాడి చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన అంశంగా మారింది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.
శాప్ కార్యాలయం వద్ద లోకేష్ యువగళం సభ్యులు మాట్లాడుతూ.. లోకేష్‌కు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా అవసరమైతే వారిని చంపుతామని బెదిరింపులకు దిగారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలను చూస్తే రాష్ట్రంలో బహిరంగంగానే ‘జంగిల్ రాజ్’(Jungle Raj) అమలు అవుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందని వారు విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే మీడియా, లోకేష్ యువగళం సభ్యులు పాల్పడిన దాష్టికాన్ని కప్పిపుచ్చే విధంగా వారిని గురువులుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన వారిని నిలదీస్తే దాడులు చేస్తారా? అంటూ సామాన్యులు సైతం ప్రశ్నలు వేస్తున్నారని వారు పేర్కొంటున్నారు.
ఏది ఏమైనా.. కొండారెడ్డి బురుజు ఎక్కినా, శాప్ కార్యాలయంలోకి చొరబడి డీఎస్సీ బాధితులపై గురువుల ముసుగులో లోకేష్ టీం దాడులు చేసినా జరిగిన అవినీతిని దాచలేరని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల కోటాలో అక్రమంగా టీచర్ ఉద్యోగాలు పొందిన వారిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించి, గురువుల మధ్య దూరిన అక్రమార్కులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, తద్వారా విద్యా వ్యవస్థను కాపాడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అర్హత లేని వారి ద్వారా విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సి వస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీతో పాటు వివిధ వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.





