డీఎస్సీ(DSC) అక్రమాలపై వివరణ కోరుతూ నిరసనకు దిగిన వైఎస్సార్‌సీపీ (YSRCP)శ్రేణులపై దాడులు, పోలీసుల లాఠీచార్జ్‌పై (Police Lathi Charge) విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిరసన హక్కును అణచివేసే చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని లెఫ్ట్ పార్టీలు సైతం ప్రభుత్వ తీరును ఇప్పటికే ఖండించాయి.
ఇదే సమయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై అరెస్టులు, కేసులు, రౌడీషీట్లకు సంబంధించిన చర్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఐదేళ్ల క్రితం టీడీపీ(TDP) కార్యాలయంపై దాడి కేసులో 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశించినట్లు వచ్చిన వార్తలు, డీఎస్సీ ఉద్యమం నేపథ్యంలో రౌడీషీట్ల అంశంపై ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు లేదా? అంటూ ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వం కఠిన చర్యల విషయంలో సంయమనం పాటించి, ప్రజాస్వామ్య హక్కులను (Democratic Rights) గౌరవించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి లేని పక్షంలో ప్రజావ్యతిరేకత మూటకట్టుకోవడం తథ్యం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.





