శాప్(SAAP) కార్యాలయం వద్ద డీఎస్సీ(DSC) నియామకాలపై నిరసనకు దిగిన వైఎస్సార్‌సీపీ(YSRCP) నాయకులు, కార్యకర్తలపై లోకేష్(Nara Lokesh) యువగళం టీమ్‌ను (Yuva Galam Team) పెట్టి దాడి చేయించారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీపై(TDP) తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ తెలుగుదేశం రాజకీయాల్లో దౌర్జన్యానికి సంబంధించిన ఘటనలను వైఎస్సార్‌సీపీ నేతలు మరోసారి చర్చకు తెస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పార్టీపై పట్టు సాధించిన సమయంలో చోటుచేసుకున్న వైస్రాయ్ హోటల్ (Viceroy Hotel) ఘటన నుంచి, విద్యుత్ ఉద్యమం సమయంలో తెలుగు సేన, చంద్రదండు వంటి బృందాల ప్రస్తావన వరకు పలు ఘటనలు టీడీపీ రాజకీయ శైలిపై ప్రశ్నలు లేవనెత్తాయని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎన్టీఆర్ నుంచి పార్టీని బలవంతంగా లాక్కుని, వైస్రాయ్ హోటల్ (Viceroy Hotel) గేట్ వద్ద ఆయన్ని అడ్డగించి చెప్పులు వేసి అవమానించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే విద్యుత్ ఉద్యమం సమయంలో ప్రజలు, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో.. తెలుగు సేన, చంద్రదండు పేరుతో బృందాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు చేయిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు నాటి ఘటనలను మరోసారి ప్రస్తావిస్తున్నారు.
అలాగే బీజేపీతో(BJP) పొత్తు విరమణ అనంతరం, అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా (Amit Shah) తిరుమల పర్యటన సందర్భంగా ఆయనపై జరిగిన రాళ్ల దాడి ఘటనను కూడా వైఎస్సార్‌సీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. తాజాగా శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ బాధితులు, వైఎస్సార్‌సీపీ నాయకులపై జరిగిన దాడి ఆరోపణలను గత ఘటనలతో ముడిపెడుతూ.. టీడీపీ రాజకీయాల్లో దౌర్జన్య ధోరణి కొనసాగుతోందని వారు విమర్శిస్తున్నారు.
ఎన్టీఆర్(NTR) కాలం నుంచి నేటి డీఎస్సీ ఆందోళనల వరకు చోటుచేసుకున్న వివిధ ఘటనలను చూస్తే.. రాజకీయ ప్రత్యర్థులపై దాడులతో నిరసనలను అణచివేసే చర్యలు టీడీపీ రాజకీయ సంస్కృతిలో భాగంగా మారాయన్నది వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న వాదన. ఈ చారిత్రక అంశాలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నేతలు లేవనెత్తిన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.





