తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Film Industry) అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో(Telugu Film Dancers Association) కొనసాగుతున్న వివాదాలపై ఫిల్మ్ ఫెడరేషన్(Film Federation) కీలక నిర్ణయం తీసుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతకు(Sumalatha) భారీ షాక్ ఇస్తూ, ఆమె నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని ఫెడరేషన్ రద్దు చేసింది.
డ్యాన్సర్స్ యూనియన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుకు ముగింపు పలికే దిశగా ఫిల్మ్ ఫెడరేషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫెడరేషన్ పెద్దల ఆధ్వర్యంలో అధ్యక్షురాలు సుమలత, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్(Raghu Master), యూనియన్ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అసోసియేషన్‌కు చెందిన మొత్తం 225 మంది డ్యాన్సర్లు హాజరైనట్లు సమాచారం.
ఈ సమావేశంలో డ్యాన్సర్ల మద్దతు ఎవరికి ఉందనే అంశంపై బలనిరూపణ నిర్వహించారు. ఇందులో సుమలతకు కేవలం 11 మంది డ్యాన్సర్లు మాత్రమే మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. మరోవైపు రఘు మాస్టర్‌కు 214 మంది డ్యాన్సర్లు మద్దతుగా నిలిచారు.
మొత్తం 225 మంది సభ్యుల్లో 214 మంది రఘు మాస్టర్‌కు మద్దతు ఇవ్వడంతో ఆయనకు భారీ మెజారిటీ లభించింది. సభ్యుల మద్దతు తక్కువగా ఉండటం, మెజారిటీ డ్యాన్సర్లు రఘు మాస్టర్ వైపు నిలవడంతో ఫిల్మ్ ఫెడరేషన్ సుమలత నేతృత్వంలోని ప్యానెల్‌ను రద్దు చేసినట్లు ప్రకటించింది.
అదే సమయంలో డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు అక్టోబర్ 11న కొత్త ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ వెల్లడించింది. తాజా పరిణామాలతో డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో రఘు మాస్టర్ ప్యానెల్‌కు సభ్యుల మద్దతు ఎలా ఉంటుందనే అంశంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.







