వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) గవర్నర్ (Governor) అబ్దుల్ నజీర్‌ను(Abdul Nazeer) కలిసి డీఎస్సీ నియామక ప్రక్రియలో(DSC Recruitment Process) జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై ఫిర్యాదు చేశారు. అలాగే సెప్టెంబర్ 21న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)(SAAP) కార్యాలయం వద్ద డీఎస్సీ వ్యవహారంపై శాంతియుతంగా నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ నాయకులు, నిరుద్యోగ అభ్యర్థులపై(Unemployed Candidates) జరిగిన దాడి, అనంతరం పోలీసుల చర్యలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. డీఎస్సీ నియామకాల్లోని ఆరోపణలపై నిరుద్యోగ యువతలో నెలకొన్న అనుమానాలను వివరించినట్లు తెలిపారు. నియామక ప్రక్రియపై స్వతంత్ర దర్యాప్తు జరిపితేనే విద్యార్థులు(Students), ఉద్యోగార్థుల్లో విశ్వాసం పునరుద్ధరించవచ్చని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ(CBI Investigation) జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ వ్యవహారంలో ప్రధానంగా నాలుగు అంశాలపై జగన్ ప్రశ్నలు లేవనెత్తారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ తదితర కీలక బాధ్యతలను ఒకే వ్యవస్థ పరిధిలో ఉంచడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పాత్రపైనా ప్రశ్నలు లేవనెత్తారు. నవీన్ (Naveen) అనే ఉద్యోగి మెరిట్ జాబితాలో తొలుత మొదటి స్థానంలో నిలిచినా, అనంతరం ఆ జాబితా నుంచి తొలగించారని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
స్పోర్ట్స్ కోటా (Sports Quota) నియామకాలపైనా జగన్ పలు ప్రశ్నలు సంధించారు. జీవో నంబర్లు 4, 47 ద్వారా సాధారణ డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉపాధ్యాయ పోస్టులకు నియామకాలు జరిగే విధానం తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా కింద 372 మంది అభ్యర్థుల నియామకంపై వివరణ ఇవ్వాలని కోరారు. అనంతరం జీవో నంబర్లు 23, 25, 56 ద్వారా నిబంధనలను మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
కొంతమంది అభ్యర్థులు నకిలీ లేదా అనుమానాస్పద క్రీడా ధ్రువపత్రాలను (Fake Sports Certificates) ఉపయోగించి ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. జూడో, సాఫ్ట్‌బాల్ తదితర క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్లపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, కొన్ని క్రీడా సంఘాల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ అంశాలపై వైఎస్సార్‌సీపీ ఇప్పటికే పలు ఆధారాలు, పత్రాలతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిందని చెప్పారు.
డీఎస్సీ వివాదానికి సంబంధించినట్లు ప్రచారంలోకి వచ్చిన ఆడియో, వీడియో ఆధారాలపై పోలీసుల స్పందనను కూడా జగన్ ప్రశ్నించారు. ఒక సంభాషణలో ఫోన్ నంబర్ కనిపిస్తున్నప్పటికీ, ఆ నంబర్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయలేదని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై అసెంబ్లీలో చంద్రబాబు (Chandrababu) గారు సదరు వ్యక్తిని అరెస్టు చేశామని అసత్యాలు చెప్పారని పెర్కోన్నారు.
సెప్టెంబర్ 21న శాప్ కార్యాలయం వద్ద జరిగిన నిరసనను ప్రస్తావిస్తూ.. డీఎస్సీ అంశంపై శాంతియుతంగా నిరసన చేపట్టనున్న విషయాన్ని వైఎస్సార్‌సీపీ ముందుగానే అధికారులకు తెలియజేసిందని జగన్ తెలిపారు. అయితే నిరసనను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం సమాంతర నిరసనను ఏర్పాటు చేసి టీడీపీ(TDP) మద్దతుదారులను అక్కడికి తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, నిరుద్యోగ అభ్యర్థులపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోకుండా నిరసనకారులపైనే పోలీసులు చర్యలు తీసుకున్నారని విమర్శించారు. పారదర్శకమైన నియామక ప్రక్రియ కోసం ప్రశ్నించిన నిరుద్యోగ యువతపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు.
డీఎస్సీ నిరసనల్లో పాల్గొన్న కొందరిపై రౌడీషీట్లు (Rowdy Sheets) తెరిచినట్లు వస్తున్న ఆరోపణలపైనా జగన్ స్పందించారు. శాంతియుత నిరసనలో పాల్గొన్నందుకు యువత భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే చర్యలు తీసుకోవడం సరికాదని అన్నారు. నియామక ప్రక్రియలో అవకతవకలు ఉన్నాయని భావించినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు, నిరుద్యోగులకు ఉంటుందని పేర్కొన్నారు.
మొత్తం వ్యవహారం ప్రభుత్వ నియామక పరీక్షలపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికేనని జగన్ అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు నియామకాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతాయనే నమ్మకంతో ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. డీఎస్సీ ఆరోపణలపై సీబీఐ విచారణ, బాధ్యత వహించాల్సిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను వైఎస్సార్‌సీపీ కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.





