పేరుపోగు క్రాంతికుమార్ (Perupogu Krant Kumar) ఆత్మహత్య కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో(Andhra Pradesh High Court) కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రాంతికుమార్ ఆత్మహత్యకు సీఐ నాగరాజు (CI Nagaraju) వేధింపులే (Harassment) కారణమని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీతో(DGP) పాటు సంబంధిత పోలీసు అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పిటిషనర్‌ను బెదిరించవద్దని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో 30 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సిన నిబంధనపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశంపై సీపీ(CP), ఏసీపీతో(ACP) పాటు సీఐ నాగరాజుకు నోటీసులు జారీ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన క్రాంతికుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు(Perupogu Venkateswara Rao).. తమ కుమారుడి కేసులో ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గాదే సాయికృష్ణ కేసులో (Gade Saikrishna) సిట్ (SIT)ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. క్రాంతికుమార్ కేసులో మాత్రం ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని అన్నారు. దీనిని కుల వివక్షగా అభివర్ణించిన ఆయన.. ప్రభుత్వంపై నమ్మకం లేకే హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ (CBI Investigation) కోరామని తెలిపారు.
తమ కుటుంబ సభ్యులను కేసు ఉపసంహరించుకోవాలని నాగరాజు అనుచరులు బెదిరిస్తున్నారని వెంకటేశ్వరరావు ఆరోపించారు. కుటుంబ సభ్యులపై బెదిరింపులు ఆపాలని హైకోర్టు పోలీసులను ఆదేశించిందని వెల్లడించారు. క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోలో తన ఆత్మహత్యకు సీఐ నాగరాజు వేధింపులే కారణమని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.
గతంలో తాను టీడీపీకి(TDP) మద్దతుగా తిరిగానని, అయినప్పటికీ తన కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ఎందుకు స్పందించలేదని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల ఓట్లు అవసరం లేదా, కేవలం ఇతర వర్గాల ఓట్లే కావాలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25 మంది ఎస్సీలు హత్యకు గురయ్యారని ఆయన ఆరోపించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
క్రాంతికుమార్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ(YSRCP) అండగా నిలిచిందని, వైఎస్ జగన్ (Ys Jagan)తమ ఇంటికి వచ్చి భరోసా ఇచ్చారని వెంకటేశ్వరరావు తెలిపారు. హోంమంత్రి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలతో కలిసి పర్యటించి బాధిత కుటుంబాలకు న్యాయం కోసం పోరాడుతామని చెప్పారు. దళిత సంఘాలు జేఏసీగా ఏర్పడి బాధితుల పక్షాన నిలబడతాయని ప్రకటించారు.





