ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో విపక్షాల మధ్య సమన్వయం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అధికార కూటమిపై ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) పోరాడుతుండగా.. తాజాగా వామపక్ష పార్టీలు కూడా ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో టీడీపీ–జనసేన (TDP-Jana Sena) కూటమికి వ్యతిరేకంగా విపక్షాల గొంతులు ఒక్కటయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
తాజాగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను (YS Jagan) సీపీఐ నేతలు (CPI Leaders) కలిశారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ(K. Ramakrishna), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య(Gujjala Eswaraiah), జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ(Akkineni Vanaja), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి. హరినాథరెడ్డి (P. Harinath Reddy) జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై చర్చించారు.
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ఈ నెల 26న విజయవాడలో సీపీఐ నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్సార్‌సీపీని ఆహ్వానించారు. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య జగన్‌కు ఆహ్వానం అందించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కూడా పాల్గొన్నారు.
ఇటీవల డీఎస్సీ నియామకాల్లో (DSC Recruitments) అవకతవకలు, నిరుద్యోగ సమస్య, కరువు, రైతులు, కార్మికుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో వామపక్ష పార్టీలు కూడా ఆయా అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. దీంతో ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటానికి అవకాశం ఏర్పడుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు, దాడులు జరిగాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు రైతులు, కార్మిక సంఘాల విషయంలో ప్రభుత్వ వైఖరిపై వామపక్షాలు కూడా పలు సందర్భాల్లో విమర్శలు చేశాయి. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం. అప్పలరాజుపై (M. Appalaraju) పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగించిన అంశం సహా పలు పరిణామాలు వామపక్షాల నుంచి వ్యతిరేకతకు కారణమయ్యాయి.
ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాడుతుండగా.. ఇప్పుడు ఆ పోరాటానికి వామపక్షాల మద్దతు కూడా లభించే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కరువు, డీఎస్సీ(DSC), రైతులు(Farmers), కార్మికులు (Workers) వంటి ప్రజా సమస్యలపై విపక్షాలు ఒకే వేదికపైకి వస్తే ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.





