---Advertisement---

ఈసీపై పెరుగుతున్న అనుమానాల వేళ.. జగన్ కీలక వ్యాఖ్యలు

September 25, 2026

Summarize with AI

---Advertisement---

వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎన్నికల సంఘం (Election Commission) పనితీరుపై కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం (Democracy) బలంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు పలు సందర్భాల్లో నిర్ణయాలు, ఓటర్ల జాబితాలు, ఈసీఐనెట్ (ECINET) నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువడటంతో ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయని జగన్ తెలిపారు.

ఆరోపణలు, ప్రత్యారోపణలకంటే.. ఏ అంశాలపై అభ్యంతరాలు నమోదయ్యాయి, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఓటర్ల జాబితాలో(Voter List) పేర్లను చేర్చడం, తొలగించడం, తిరిగి పునరుద్ధరించడం వంటి ప్రక్రియలు ఎంత పారదర్శకంగా జరిగాయనే విషయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ప్రతి పౌరుడి (Citizen) ఓటు హక్కును (Right to Vote) కాపాడటంతో పాటు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచే చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండటమే కాకుండా.. పారదర్శకత పాటించబడిందనే నమ్మకం కూడా ప్రజలకు కలగాలని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 2023లో తీసుకొచ్చిన ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్‌మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) యాక్ట్‌’ (Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Act)ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పునఃపరిశీలించాలని జగన్ కోరారు. గతంలో తమ పార్టీ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిందని గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే మూడు సభ్యుల కమిటీ ద్వారా ఎన్నికల కమిషనర్లను నియమించే విధానాన్ని తిరిగి తీసుకురావాలని జగన్ సూచించారు. పరీక్ష రాసే విద్యార్థే తన పరీక్షకుడిని నియమించుకునే పరిస్థితి ఉంటే అనుమానాలకు తావుంటుందన్న ఉదాహరణను ప్రస్తావిస్తూ.. నిష్పాక్షికత కోసం నియామక ప్రక్రియలో తటస్థత అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి మార్పు ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు దోహదపడుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) జరిగిన ఎస్‌ఐఆర్(SIR) ప్రక్రియను కూడా జగన్ ప్రస్తావించారు. అధికారంలో ఉన్న పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, తమ పార్టీ చేసిన పలు అభ్యంతరాలను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో డివిజన్ల పునర్విభజన తీరుపై ప్రతిపక్షంగా తమ పార్టీ చేసిన అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు.

ఇలాంటి పరిణామాలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని బలహీనపరుస్తాయని జగన్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ సంస్థ పనితీరుకైనా పారదర్శకత, జవాబుదారీతనమే ప్రధాన ప్రమాణాలని, వాటిని కాపాడటం ఆ సంస్థల ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment